Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో నిత్యం రద్దీగా ఉంటుంది. నడవడానికే కష్టంగా ఉండే ఓల్డ్ సిటీ రోడ్లపై వాహనాలు యథేచ్ఛగా తిరుగుతాయి. దీంతో ట్రాఫిక్ సమస్య మరింత పెరుగుతుంది. అయితే సిగ్నలింగ్ వ్యవస్థ కూడా లేకపోవడంతో ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దానికి తోడు సిగ్నల్ జంక్షన్లలో రాజకీయ నాయకుల బ్యానర్లు కడుతుండటంతో వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు.
పాతబస్తీలోని బై బజార్ ఎక్స్ రోడ్, ఫలక్‌నుమా ఇంజన్ బౌలి, హఫీజ్ బాబా నగర్, దారుల్ షిఫా మరియు పురానాపూల్ ఏరియాలలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తున్నది. ఈ జంక్షన్లలో సరైన ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ లేకపోవడంతో వాహనాల రాకపోకలను నిర్వహించడంలో ట్రాఫిక్ పోలీసులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చొరవ చూపకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే పాతబస్తీ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న మాదిరిగా కనిపిస్తుంది. పాతబస్తీ అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు చొరవ చూపించకపోవడం బాధాకరం. నిజానికి పాతబస్తీ చారిత్రక కట్టడాలకు నిలయం. చార్మినార్, మక్కా మసీద్, ఫలక్‌నుమా ప్యాలెస్ ఇలా అనేక చారిత్రక సంపదకు నిలయం ఓల్డ్ సిటీ. అయినప్పటికీ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకపోవడం వెనుక స్థానిక లీడర్ల హస్తం ఉన్నదనేది ప్రధాన విమర్శ. అయితే కారణాలేమైనా పాతబస్తీ ప్రజలే నిత్యజీవితంలో ఇబ్బందులు పడుతున్నారు.
Read More: Diseases: వర్షాకాలంలో వచ్చే వ్యాధులు ఇవే.. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీరు సేఫ్..!