Hyderabad CP : డ్రగ్స్ ముఠాలను సహించేది లేదని, వాటికి ఇక చోటులేదని హైదరాబాద్ నూతన సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పబ్స్, రెస్టారెంట్లు, ఫామ్‌హౌస్ యజమానులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ మహమ్మారిని కూకటివేళ్లతో పెకిలించాలని సీఎం చెప్పారని సీపీ పేర్కొన్నారు. తన శక్తి సామర్థ్యాలను గుర్తించి సీపీగా బాధ్యతలు అప్పగించినందుకు సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ ఉదయం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన గ్రే హౌండ్స్ , అక్టోపస్‌లో పనిచేశారు.
We’re now on WhatsApp. Click to Join.
బాధ్యతలు చేపట్టిన అనంతరం హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి (Hyderabad CP) మీడియాతో మాట్లాడారు. ‘‘సినీ రంగంలో డ్రగ్స్ వినియోగం ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ వినియోగం లేకుండా సినిమా పెద్దలు చూడాలి. మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా విషయంలో అన్ని వర్గాలతో పాటు సినిమా పెద్దలతో కూడా సమావేశాలు నిర్వహిస్తాం. చట్టాన్ని గౌరవించే వారితో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది. ఉల్లంఘించే వారితో కఠినంగా ఉంటాం. ఉద్దేశపూర్వక నేరాలు చేసేవారితో చాలా కరకుగా ఉంటాం’’ అని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో సమన్వయం చేసుకుంటూ.. డ్రగ్స్ సరఫరా చేసే వారికి హైదరాబాద్‌లో చోటు లేకుండా చేస్తామన్నారు. బార్స్, పబ్స్, ఫామ్ హౌస్‌లలో డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.