Petrol Price Hike : హైదరాబాద్ కు ఏమైంది? పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు?

హైదరాబాద్ లో వింత పరిస్థితి నెలకొంది. ఈమధ్యకాలంలో ఎప్పుడూ పెట్రోల్, డీజిల్ కు కటకటే లేదు.

  • Written By:
  • Publish Date - June 11, 2022 / 06:00 PM IST

హైదరాబాద్ లో వింత పరిస్థితి నెలకొంది. ఈమధ్యకాలంలో ఎప్పుడూ పెట్రోల్, డీజిల్ కు కటకటే లేదు. అలాంటిది ఇప్పుడు చాలా పెట్రోల్ బంకుల ముందు నో స్టా్క్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఉదయాన్నే పెట్రోల్ కొట్టించుకుందామంటే బంకుల ముందు ఈ బోర్డులు దర్శనం ఇస్తుండడంతో వినియోగదారుల గుండెలు లబ్ డబ్ మంటున్నాయి. నిజానికి ఈ సమస్యను పరిష్కరించడానికి మంత్రి గంగుల కమలాకర్.. చమురు సంస్థల ప్రతినిధులు, డీలర్లతో ఓ మీటింగ్ ఏర్పాటుచేశారు. కలిసికట్టుగా పనిచేస్తూ సమస్య రాకుండా చూడాలన్నారు. అయినా ఫలితం లేకపోయింది.

గురువారం వరకు రెండు కంపెనీల పెట్రోల్ బంకుల ముందే ఈ బోర్డులుండేవి. ఇప్పుడు ఐవోసీఎల్ బంకుల ముందు కూడా ఇదే పరిస్థితి. శని, ఆది, సోమవారాల్లోనూ ఇదే సీన్ ఉంటే… వినియోగదారుల నుంచి ఒత్తిడి ఇంకా పెరుగుతుందంటున్నారు డీలర్లు. పెట్రోల్ కొరతపై ప్రజలు, మీడియా సీరియస్ గా ఫోకస్ పెట్టడంతో చమురు సంస్థలు డిమాండ్ కు తగ్గట్టుగా సప్లయ్ ని పెంచడానికి ప్రయత్నించాయి. ఇండెంట్ పెట్టిన రెండు మూడు రోజుల తరువాత ట్యాంకర్లను పంపించే పద్దతికి కూడా స్వస్తి చెప్పారు. కేవలం ఒక్కరోజులోనే సరఫరా చేస్తున్నారు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది.

ప్రస్తుతం చమురు పంపిణీని షిఫ్ట్ పద్దతుల్లో చేస్తున్నారు. దీనివల్ల సరఫరా విషయంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఎందుకంటే.. పెట్రోల్, డీజిల్ ఎంత కావాలో చెబుతూ దానికి తగ్గట్టుగా ఇండెంట్ ను పెట్టి మధ్యాహ్నం 2 గంటలలోపు చమురు సంస్థల ఖాతాల్లోకి డబ్బులు వేయాలి. అలా అయితేనే దానిని ఆరోజు ఇండెంట్ గా లెక్కేస్తారు. ఒకవేళ మధ్యాహ్నం 2 గంటలు దాటిన తరువాత డబ్బులు డిపాజిట్ చేస్తే.. దానిని మరుసటి రోజు ఇండెంట్ గా పరిగణిస్తారు. అంటే శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలలోపు చమురు సంస్థల ఖాతాలకు డబ్బులు డిపాజిట్ చేస్తేనే ఫలితం. అలా అయితేనే ఆ మరుసటి రోజు.. అంటే శనివారం నాడు డెలివరీ ఉంటుంది. ఒకవేళ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల లోపు డబ్బులు జమ చేయడం అవ్వకపోతే.. రెండో, నాలుగో శనివారాలు బ్యాంకులు పనిచేయవు. అంటే మళ్లీ సోమవారం నాడు మాత్రమే డబ్బులు డిపాజిట్ చేయడానికి అవుతుంది ఆలోగా… అంటే శనివారం, ఆదివారం, సోమవారం నాడు పెట్రోల్ లేక నో స్టాక్ బోర్డులు పెట్టక తప్పడం లేదంటున్నారు డీలర్లు.

హైదరాబాద్ జిల్లా పరిధిలో రోజుకు 300 ట్యాంకర్ల ద్వారా పెట్రోల్ సరఫరా జరిగేది. కానీ ఇప్పుడు 150-200 ట్యాంకర్లు మాత్రమే వస్తుండడంతో సప్లయ్ కన్నా డిమాండ్ పెరిగి కొరత ఏర్పడుతోంది.