Ganesh Immersion: ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనానికి లైన్ క్లియర్!

హుస్సేన్ సాగర్ సరస్సులో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై ఎలాంటి ఆంక్షలు లేవని,

  • Written By:
  • Updated On - September 8, 2022 / 12:13 PM IST

హుస్సేన్ సాగర్ సరస్సులో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై ఎలాంటి ఆంక్షలు లేవని, షెడ్యూల్ ప్రకారమే సెప్టెంబర్ 9న నిమజ్జన ప్రక్రియ నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నిన్న ఖైరతాబాద్ గణేశుడికి పూజలు చేసిన అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. గణేష్ నిమజ్జనాన్ని రాజకీయం చేసేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు ప్రయత్నిస్తున్నారని, పండుగల పేరుతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆరోపించారు.

సెప్టెంబర్ 9న ట్యాంక్ బండ్ వద్ద గణేష్ విగ్రహాల సామూహిక నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారని, నిమజ్జన ప్రదేశాల్లో ఇప్పటికే క్రేన్లను ఏర్పాటుచేసినట్టు మంత్రి తెలిపారు.  “అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. నిమజ్జన ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి విస్తృతమైన చర్యలు తీసుకుంటున్నారు. కానీ, నగరంలో నిమజ్జనం పేరుతో బీజేపీ నేతలు ర్యాలీలు నిర్వహించడం, నిరసనలు చేయడం చాలా దురదృష్టకరం’’ అని తలసాని అన్నారు.

అనంతరం ఎన్టీఆర్‌ మార్గ్‌లో ఏర్పాటు చేసిన క్రేన్‌లను తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సందర్శించి ట్యాంక్‌బండ్‌ చుట్టూ తిరుగుతూ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) పోలీసు శాఖ సహకారంతో హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్ సరస్సు, 74 కృత్రిమ చెరువులతో సహా దాదాపు 60 నీటి కొలనుల్లో గణేష్ నిమజ్జనాన్ని నిర్వహించాలని యోచిస్తోంది. కాగా హుస్సేన్ సాగర్‌లో గణేష్ విగ్రహ నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ట్యాంక్ బండ్‌లో మట్టి విగ్రహాల నిమజ్జనానికి ఇప్పటికీ అనుమతి ఉందని, అయితే 2022 జూలై 21 నాటి హైకోర్టు ఉత్తర్వుల కారణంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను మాత్రమే నిషేధించామని పేర్కొంది. బీజేపీ, గణేష్ ఉత్సవ కమిటీల ఒత్తిడితో ట్యాంక్ బండ్ లో అన్ని నిమజ్జనాలు జరగనున్నాయి.