ఇంటి నిర్మాణ అనుమతుల (House construction permit) కోసం నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన రోజులు ఇక పోయాయి. జీహెచ్ఎంసీ (GHMC) తాజాగా ‘బిల్డ్ నౌ’ (Build Now App)అనే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ద్వారా ఫోన్ నుంచే ఇంటి నిర్మాణ అనుమతులు పొందే అవకాశం కల్పించబడింది. మారుతున్న టెక్నాలజీని అనుసరిస్తూ, ప్రజలకు మరింత సౌలభ్యంగా సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. మార్చి 10 నుంచి ఈ నూతన సాఫ్ట్‌వేర్ అమలులోకి రానుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా అనుమతులు
‘బిల్డ్ నౌ’ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 75 గజాలలోపు స్థలాల నిర్మాణానికి దరఖాస్తు సమర్పించిన వెంటనే అనుమతి లభిస్తుందని జీహెచ్ఎంసీ ప్రకటించింది. పెద్ద స్థలాల కోసం గరిష్ఠంగా 15 రోజుల్లో అనుమతులు మంజూరు చేయబడతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పని చేసే ఈ యాప్ ద్వారా ఇంటి డ్రాయింగ్‌ను నిమిషాల్లోనే పరిశీలించి తక్షణమే అనుమతి ఇవ్వనున్నది.
వివిధ ప్రభుత్వ శాఖలతో అనుసంధానం
ఈ యాప్ ద్వారా GHMC, HMDA, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ, నీటిపారుదల, మూసీ అభివృద్ధి సంస్థ తదితర ప్రభుత్వ విభాగాల అనుమతులు ఒకేచోటే పొందే వీలుంటుంది. దరఖాస్తుదారు తన అప్లికేషన్ స్టేటస్‌ను ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. ఏ అధికారి వద్ద పర్మిషన్ పెండింగ్‌లో ఉందో కూడా అప్లికేషన్ ద్వారా తెలిసిపోతుంది.
ప్రజలకు మరింత సౌలభ్యం
సామాన్య ప్రజలకు నిర్మాణ అనుమతుల గురించి పూర్తి సమాచారం తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఎన్ని అంతస్థులు కట్టుకోవచ్చో, సెట్‌బ్యాక్ ఎంత వదలాలో, భవన నిర్మాణ నిబంధనల గురించి వెబ్‌సైట్‌లో స్పష్టమైన వివరాలు లభిస్తాయి. అంతేకాకుండా, 3డీ ఇంటి నమూనాలను కూడా యాప్‌లో చూసే వెసులుబాటు కల్పించారు. ఈ కొత్త విధానం వల్ల నిర్మాణ అనుమతుల ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు అవినీతిని తగ్గించేందుకు ఉపయోగపడే అవకాశముంది.