CM Revanth : నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేల్ తరోడా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కొంతకాలం క్రితమే తండ్రిని కోల్పోయిన 11 ఏళ్ల దుర్గ.. ఇప్పుడు తల్లిని కూడా కోల్పోయింది. ఆర్థిక సమస్యలు తట్టుకోలేక, కుటుంబ భారాన్ని మోయలేక దుర్గ తల్లి గంగామణి (36) శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. దీంతో దుర్గ అనాథగా మిగిలింది. తల్లి అంత్యక్రియల ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో దుర్గ భిక్షాటనకు కూర్చుంది. దీంతో ఇరుగుపొరుగు వారు, గ్రామస్తులు చెరో కొంత సాయాన్ని అందించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
We’re now on WhatsApp. Click to Join
కలెక్టర్‌కు సీఎం రేవంత్ ఆదేశం
ఈ కేసును విచారించడానికి వచ్చిన పోలీసులు కూడా దుర్గ పరిస్థితి చూసి సహాయం చేశారు.ఈ సంఘటన గురించి విన్న ఇతరులు కూడా ఆన్‌లైన్ ద్వారా ఆమెకు డబ్బులను విరాళంగా పంపారు. ఈనేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth) కూడా స్పందించారు. దుర్గకు విద్య,వైద్య, ఇతర అవసరాలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సదరు బాలికలకు సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు బాలికకు ఉచిత విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలలో చేరుస్తామని కలెక్టర్ వెల్లడించారు. వైద్య సమస్యలు, ఇతర సమస్యలు ఉంటే సహాయం చేస్తామని ప్రకటించారు.
Also Read :Champai Soren : ‘‘మీరొక పులి.. ఎన్డీయేలోకి స్వాగతం’’.. చంపై సోరెన్‌కు ఆహ్వానం
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేయూత..
ఆపదలో ఉన్నవారిని ఆదుకునే విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు. చిన్నారి దుర్గకు కూడా సాయం చేస్తానని ఆయన ప్రకటించారు. దుర్గకు తమ ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ నుంచి రూ. లక్ష సాయాన్ని ప్రకటించారు. ఈ నగదును నిర్మల్ జిల్లా అధికారుల ద్వారా దుర్గకు మంత్రి కోమటిరెడ్డి చేరవేశారు.దుర్గ చదువు పూర్తయ్యేంత వరకు ఆమెకు అండగా ఉంటానని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. చిన్నారికి ఇల్లు కూడా సమకూరుస్తానని ఆయన తెలిపారు. ఖర్చులకు ప్రతినెలా డబ్బులు పంపుతానన్నారు. త్వరలోనే దుర్గను కలుస్తానని ఆయన తెలిపారు. ఈ మేరకు దుర్గకు కాల్ చేసి.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధైర్యం చెప్పారు.