Site icon HashtagU Telugu

Seethakka: తాను ఏ పదవిలో ఉన్నా ములుగు ప్రజలకు సేవా చేస్తా: మంత్రి సీతక్క

Minister Seethakka

Minister Seethakka

Seethakka: తాను ఏ పదవిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ములుగు నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని ములుగు ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. మంత్రి పదవి దక్కడంపై హర్షం వ్యక్తం చేసిన ఆమె.. తెలంగాణ ప్రజలు తనకు మరింత పెద్ద బాధ్యతను ఇచ్చారని అన్నారు. తెలంగాణ ప్రజలు నియంతృత్వాన్ని తరిమికొట్టి ప్రజాస్వామ్యానికి పట్టం కట్టారని ఆమె అన్నారు. ప్రజలంతా ఆశించే సంక్షేమ రాజ్యాన్ని తీసుకువస్తామని, రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామని సీతక్క వెల్లడించారు.

ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2011 వరకు వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమ విధానాలను ఇప్పుడు కూడా అమలు చేస్తామని వివరించారు. సంక్షేమ పాలనలో అన్ని వర్గాల మద్దతు ఉంటుందని, వారికి అందరూ సహకరించాలని ఆమె కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక సమస్యలు ఉన్నాయని ఆమె అన్నారు. రోడ్డు రవాణా సమస్యలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారని ఆమె అన్నారు.

ఆ ప్రాంతాల్లో సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని వివరించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి గొప్పలు చూపించడమే కాకుండా అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారానికి ముందు ఓ మీడియా సంస్థతో మాట్లాడిన సందర్భంగా సీతక్క ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read: Students Missing: తిరుమలలో తప్పిపోయిన విద్యార్థులు కామారెడ్డిలో ప్రత్యక్షం