Site icon HashtagU Telugu

Tamilisai: తమిళిసై.. ‘ప్రజాదర్బార్’ కు సై!

Tamilisai Kcr

Tamilisai Kcr

వచ్చే నెల నుంచి రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహించనున్నట్లు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రకటించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది వేడుకల్లో ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. ఇక నుంచి నేరుగా ప్రజలను కలుస్తానని ఆమె తెలిపారు. రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఇతర మంత్రులు దూరంగా ఉన్నారు. అయితే, ఈ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, బిజెపి ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, ఎం రఘునందన్ రావు, కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

ఉగాది వేడుకలకు అధికార పక్షం హాజరుకాకపోవడంతో తమిళి సై తనదైన శైలిలో స్పందించారు. ఇతర రాష్ట్రాల ప్రముఖులు కూడా ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ‘‘నేను ఆహ్వానించినవాళ్లంతా వచ్చారు.. కేవలం మీరు తప్ప’’ అంటూ పరోక్షంగా కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక గణతంత్ర దినోత్సవ వేడుకలకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 26న తనను తాను తెలంగాణ సోదరిగా అభివర్ణిస్తూ రాజ్‌భవన్‌లో స్నేహపూర్వక గవర్నర్‌ ఉన్నారని తమిళిసై ప్రకటించారు. రాజ్‌భవన్‌ తలుపులు ప్రజలకు ఎప్పుడూ తెరిచే ఉంటాయని గవర్నర్‌ చెప్పారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకునేందుకే ఫిర్యాదుల పెట్టెలను ప్రారంభించినట్లు తమిళిసై తెలిపారు. తాను స్ట్రాంగ్ పర్సన్‌ అని.. ఎవరికీ లొంగనన్నారు. గవర్నర్ హోదాలో తన పరిమితులు తనకు తెలుసని.. తననెవరూ నియంత్రించలేరని ఆమె స్పష్టం చేశారు. త్వరలోనే ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు ఆమె చెప్పారు. తనకు ఇగో లేదని.. రాజ్‌భవన్ లిమిటేషన్స్ తనకు తెలుసన్నారు.

తన ప్రసంగం లేకుండానే రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు జరగడంపై గవర్నర్‌ అసంతృప్తి వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. యాదాద్రి ఉద్ఘాటన ఉత్సవానికీ గవర్నర్‌ను ఆహ్వానించలేదు. ఉగాది ముందస్తు వేడుకలకు ముఖ్యమంత్రి వస్తారని ఆశించినా అది జరగలేదు. అయితే ఇతర గవర్నర్లకు భిన్నంగా తమిళిసై ప్రజా సమస్యలకు చొరవ చూపుతుండటం, వినతులు స్వీకరిస్తుండటం, తరచుగా ప్రజా దర్బార్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండటం అధికార పక్షానికి మింగుడు పడటం లేదని రాజకీయ నేతలు ఆరోపిస్తుండటం చర్చనీయాంశమవుతోంది.