Site icon HashtagU Telugu

BRS Vs BJP : బీజేపీపై మౌనమేలనోయి.. కేసీఆర్, కేటీఆర్, కవిత ఫ్యూచర్ ప్లాన్ అదేనా ?

Brs Vs Bjp Political Strategy Brs Kcr Ktr Kavitha

BRS Vs BJP : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి జోష్ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ యాక్టివ్ మోడ్‌లో దూసుకుపోతున్నారు. జనంతో మమేకం అవుతున్నారు. కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును కూడా గులాబీ బాస్ కడిగి పారేస్తున్నారు. అయితే బీజేపీ పేరు కానీ, ఆ పార్టీ అగ్రనేతల పేర్లు కానీ మాట్లాడేందుకు కేసీఆర్ సాహసించడం లేదు. దీనికి  కారణం ఏమిటి ? బీజేపీపై కేసీఆర్ మౌనం వెనుక అంతరార్ధం ఏమిటి ?  ఆయన ఫ్యూచర్ ప్లాన్ ఏమిటి ? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read :Google Pay: గూగుల్‌ పేలో బిల్ పేమెంట్స్‌ చేస్తున్నారా? బ్యాడ్ న్యూస్

గత ఎన్నికల్లో బీజేపీకి బలం దక్కేలా.. 

‘‘లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి  ఓట్లు వేయించారు. బీఆర్ఎస్(BRS Vs BJP) రాజకీయంగా ఆత్మహత్య చేసుకుంది’’ అని గతంలో సీఎం రేవంత్ విమర్శించారు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన లోక్‌సభ స్థానాలన్నీ, అంతకుముందు వరకు బీఆర్ఎస్‌కు కంచుకోటల లాంటివే. మహబూబ్ నగర్, చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ లోక్‌సభ స్థానాలలో బీజేపీ విజయఢంకా మోగించింది. బీజేపీ, కాంగ్రెస్‌లు చెరో 8 లోక్‌సభ సీట్లను గెల్చుకున్నాయి. మజ్లిస్ పార్టీ 1 ఎంపీ సీటును గెల్చింది. కానీ బీఆర్ఎస్ ఒక్క లోక్‌సభ సీటును కూడా గెలవలేకపోయింది. అనూహ్యంగా ఇలాంటి ఫలితం ఎందుకు వచ్చింది ? అనే ప్రశ్నకు నేటికీ సమాధానం దొరకలేదు. అయితే గత లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కూడా బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ నోరు విప్పలేదు. ఫలితంగా బీజేపీకి కలిసొచ్చింది. బీఆర్ఎస్ కీలక నేతలు అప్పట్లో అకస్మాత్తుగా బీజేపీలో చేరిపోయి, ఎంపీ టికెట్లు తీసుకున్నారు. దీనివల్ల బీఆర్ఎస్ క్యాడర్ అంతా బీజేపీకి మళ్లింది. దీనివల్లే   ఏకంగా 8 లోక్‌సభ సీట్లను బీజేపీ గెలవగలిగింది.

Also Read :Rajalinga Murthy : రాజలింగ మూర్తి హత్యపై రాజకీయ దుమారం

బీఆర్ఎస్‌కు పెద్ద ముప్పు బీజేపీయే

గత లోక్‌సభ ఎన్నికల ఫలితాలను నిశితంగా పరిశీలించిన వారు ఎవరైనా చెప్పే సమాధానం ఒక్కటే. బీఆర్ఎస్‌కు పెద్ద ముప్పు బీజేపీయే. బీఆర్ఎస్ లోక్‌సభ సీట్ల సంఖ్య 0కు చేరడానికి కారణం బీజేపీయే. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి ముఖ్య నేతలంతా చేరింది కూడా బీజేపీలోనే.  అందుకే ఫ్యూచర్‌లోనూ అదే జరిగే అవకాశం ఉంది. అయినా బీజేపీపై విమర్శలకు కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. దీనివల్ల రాజకీయంగా బీఆర్ఎస్‌కు క్షేత్రస్థాయిలో చేటు జరుగుతుందని రాజకీయ పండితులు అంటున్నారు. భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకునే ఆలోచన కేసీఆర్‌కు ఉంటే.. పలు కేసుల విషయంలో బీజేపీతో రాజీపడేందుకు బీఆర్ఎస్ సిద్ధమైతే.. రానున్న రోజుల్లో ఏదైనా జరగొచ్చు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ, బీఆర్ఎస్ ఏకమైనా ఆశ్చర్యం ఉండదు. అయితే ఇది ఇప్పట్లో జరగకపోవచ్చు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి  ఈ దిశగా ఏదైనా అనూహ్య పరిణామాన్ని మనం చూసే అవకాశం ఉండొచ్చు.