Telangana: తెలంగాణలో శాసనసభ్యులుగా ఎన్నికైన ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయగా, మరొకరు రాజీనామా చేసే అవకాశం ఉంది. అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు ఆ స్థానాలు ఖాళీగానే ఉంటాయి. ఈసారి రాష్ట్రంలో ఏడుగురు ఎంపీలు ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేశారు. వీరిలో ముగ్గురు గెలుపొందగా, బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు ఓటమి పాలయ్యారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఈమేరకు రేవంత్ రెడ్డి బుధవారం ఎంపీ పదవికి రాజీనామా చేశారు. నల్గొండ నుంచి ఎంపీగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. భువనగిరి ఎంపీగా కొనసాగుతున్న మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది.దుబ్బాక అసెంబ్లీ స్థానంలో బీఆర్‌ఎస్ నేత, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. ఆయన ఎంపీ పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తారనే విషయంపై క్లారిటీ లేదు. సాధారణంగా, ఎంపీ లేదా ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేసినప్పుడు, ఖాళీని భర్తీ చేయడానికి ఆరు నెలల్లో ఉప ఎన్నిక నిర్వహిస్తారు. అయితే ఈ నలుగురు ఎంపీల పదవీకాలం 2024 ఏప్రిల్‌తో ముగియనుంది.. అంటే దాదాపు 4 నెలల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదు. అప్పటి వరకు ఈ నాలుగు పార్లమెంట్ స్థానాలు ఖాళీగానే ఉంటాయి.
Also Read: Pawan Kalyan: తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి మరింత ముందుకు తీసుకువెళ్లాలి: పవన్ కళ్యాణ్