BJP Telangana: భజన వద్దు.. బలోపేతం చేయండి!

మోడీ, అమిత్ పర్యటించినంత మాత్రాన తెలంగాణాలో పార్టీ ఎలా అధికారంలోకి వచ్చేస్తుందని

  • Written By:
  • Updated On - January 27, 2023 / 11:52 AM IST

ఏదైన రాష్ట్రంలో అధికారం (Ruling) దక్కించుకోవడం ఏ పార్టీకి అంత ఈజీ కాదు. మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పార్టీలోని ప్రతి కార్యకర్తతో కలిసి పనిచేయాలి. వాళ్లకు నిత్యం దిశా నిర్దేశం చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నిత్యం ప్రజల్లో ఉండాలి. ఇదంతా ఏ పార్టీ గురించో కాదు తెలంగాణ బీజేపీ (Telangana BJP) గురించే. తెలంగాణలో నరేంద్రమోడీ (PM Modi), అమిత్ షా, జేపీ నడ్డా రెగ్యులర్ గా పర్యటించటం ద్వారా బీజేపీ అధికారంలోకి వస్తుంది? అనే ధీమాతో ఉన్న బీజేపీ శ్రేణులు. అయితే మోడీ, అమిత్ పర్యటించినంత మాత్రాన తెలంగాణాలో పార్టీ ఎలా అధికారంలోకి వచ్చేస్తుందని కొంతమంది బీజేపీ నేతలు తమలో తాము అనుకుంటున్నారు. తెలంగాణలో మోడీ, అమిత్ పర్యటిస్తే తెలంగాణకు, బీజేపీకి లాభం కూర్చినా ఎంతవరకు కలిసివస్తుంది? అనేది తెలియడం లేదని అంటున్నారు.

అయితే పార్టీ బలోపేతాన్ని పక్కన పెట్టి నిత్యం 24 గంటలూ అమిత్ షా (Amit shah) భజనే చేస్తున్నారని బీజేపీ యువత అభిప్రాయపడుతున్నారు. కేంద్రం పెద్దల భజనలపైన దృష్టిపెట్టేబదులు పార్టీని క్షేత్రస్ధాయిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా తెలంగాణ బీజేపీ (BJP Telangana) అధిష్టానం చేయడం లేదని రాజకీయ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి. కేసీఆర్ ను తిట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. కేసీఆర్ ను తిట్టినంత మాత్రాన బీజేపీ బలోపేతం కాదనే విషయాన్ని తెలంగాణ బీజేపీ మరచిపోయినట్లున్నారు. బీజేపీ క్షేత్రస్ధాయిలో చాలా బలహీనంగా ఉంది. గడచిన రెండు ఎన్నికల్లోను కేవలం మోడీ (PM Modi) గాలివల్లే నాలుగు సీట్లొచ్చాయంతే. అప్పటి నుండి సంస్థాగతంగా కానీ, క్షేత్రస్ధాయిలో బలపడేందుకు కానీ, బీజేపీ పెద్దగా దృష్టిపెట్టిందిలేదు. తెలంగాణలో అమిత్ షా రెగ్యులర్ గా పర్యటిస్తే చాలు ఓట్లు పడిపోతాయని అనుకుంటున్నారు.

ఇప్పటికి రెండుసార్లు అమిత్ షా పర్యటన వాయిదాపడింది. ఇక నుండి మోడీ, అమిత్, నడ్డాలు రెగ్యులర్ గా తెలంగాణ (Telangana) లో పర్యటించబోతున్నారట. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వివిధ సమీకరణలు కలిసిరావటం వల్లే బీజేపీ గెలిచిందని అందరికీ తెలుసు.  119 నియోజకవర్గాల్లో మహా అయితే ఓ 25 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులున్నారంతే. మిగిలిన నియోజకవర్గాల్లో గట్టి నేతలు లేరుకాబట్టే ఇతర పార్టీల నుండి లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అధినేత బండి సంజయ్, అండ్ కో  ఇప్పటికైనా బలోపేతానికి పాటు పడాలని కిందిస్థాయి బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.