Amit Shah: వచ్చే 30 – 40 ఏళ్లు అధికారం బీజేపీదే.. భారత్ విశ్వగురు అవుతుంది : అమిత్ షా

జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ దూకుడు మీదుంది. అందుకే అది మాట్లాడే ప్రతి మాటలోనూ ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది.

  • Written By:
  • Publish Date - July 3, 2022 / 04:21 PM IST

జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ దూకుడు మీదుంది. అందుకే అది మాట్లాడే ప్రతి మాటలోనూ ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. ఇదే క్రమంలో వచ్చే 30-40 ఏళ్లు ఇండియాలో బీజేపీయే అధికారంలో ఉంటుందని.. ఇది బీజేపీ శకమని చెప్పారు కేంద్ర హోం శాఖామంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా. పైగా భారతదేశం ప్రపంచానికే గురువుగా మారుతుందని.. విశ్వ గురుగా అవుతుందని అన్నారు. అంటే ప్రపంచాన్నే ఏలే సామర్థ్యాన్ని సంతరించుకుంటుందని అర్థం.

సమావేశాల్లో రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం అనేక సమస్యలతో కునారిల్లడానికి వారసత్వ రాజకీయమే కారణమన్నారు. కుల రాజకీయాల వల్ల వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందన్నారు. అవే పాపాలుగా మారాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిశాతో పాటు మిగిలిన రాష్ట్రాల్లోనూ బీజేపీ త్వరలో అధికారంలోకి వస్తుందన్నారు అమిత్ షా. 2014 నుంచి కమలం పార్టీ పవరేంటో అందరికీ తెలిసిందన్నారు.

బీజేపీ ఇప్పటికే ఎన్నో ఎన్నికల్లో గెలిచిందని అమిత్ షా చెప్పారన్నారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. అభివృద్ధికి, ప్రతిభకు పట్టం కట్టేలా రాజకీయాలు చేయబట్టే ప్రజలు ఓట్లేసి బీజేపీని గెలిపిస్తున్నారన్నారు. అంటే తమకు ప్రజామోదం ఉన్నట్టే అర్థమన్నారు. కుటుంబ రాజకీయాలు, కుల రాజకీయాలకు చెక్ పెట్టాలన్నారు. బీజేపీ ఎదుగుదలకు మరో మెట్టు దక్షిణ భారతదేశం నుంచి పడుతుందన్నారు శర్మ. దీంతో కమలనాథులు ఫుల్ జోష్ లో ఉన్నారని అర్థమవుతోంది. అదే సమయంలో రెండు తెలుగురాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాలు, తూర్పు రాష్ట్రాల పైన గురిపెట్టారని స్పష్టంగా తెలుస్తోంది.