హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డును డిసెంబర్ 31 రాత్రి మూసివేస్తున్నట్లు రాచకొండ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు ఔటర్ రింగ్ రోడ్డుపైకి వాహనాలను అనుమతించబోమని తెలిపారు. అయితే, సరుకులను తరలించే లారీలు, ఇతర కంటైనర్లు అనుమతించనున్నట్లు రాచకొండ పోలీసులు పేర్కోన్నారు. అలాగే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకి వెళ్లే వ్యక్తులు తమ విమాన టిక్కెట్లను చూపిస్తే అనుమతి ఇస్తామని తెలిపారు.
ఇటు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఫ్లైఓవర్లనుకూడా డిసెంబర్ 31వ తేదీ ఉదయం 11 గంటల నుంచి జనవరి ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు. క్యాబ్ డ్రైవర్లు కూడా యూనిఫాం ధరించాలని కోరారు. ప్రజలు ఎలాంటి ఫిర్యాదులకైనా 94906 17111 నంబర్‌కు సంప్రదించాలని రాచకొండ పోలీసులు కోరారు. మద్యం మత్తులో ప్రజలు వాహనాలు నడపకుండా చూడాలని బార్లు, పబ్బుల యజమానులకు పోలీసులు స్పష్టం చేశారు. అలాగే డిసెంబర్ 31 రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బిగ్గరగా మ్యూజిక్ సౌండ్స్ పెట్టడాన్ని కూడా వారు పరిమితం చేశారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే శిక్షించబడుతుందని, డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తామని పోలీసులు తెలిపారు