Telangana Secretariat: తెలంగాణ సచివాలయం కొత్త సంవత్సరంలో ప్రారంభం. ఎప్పుడంటే..!

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో కొత్త భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Published By: HashtagU Telugu Desk
Ts Secretriat

Ts Secretriat

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో కొత్త భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జనవరి 18న సచివాలయం 6వ అంతస్తులోని సీఎం బ్లాకును కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఆ రోజు నుంచి కేసీఆర్, సీఎం ఛాంబర్ నుంచి పాలన కొనసాగిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి.

ప్రారంభోత్సవ ముహూర్తం నిర్ణయించడంతో పాటు అందుకు అనుగుణంగా నిర్మాణ పనులను పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపాయి. ఇటీవల సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి పరిశీలించిన విషయం తెలిసిందే. నిర్మాణ పనుల విషయంలో అధికారులు, ఇంజనీర్లకు కేసీఆర్ పలు సూచనలు కూడా చేశారు. సచివాలయం ప్రాంగణంలోని గార్డెన్ పనుల్లో కాంట్రాక్టర్ వేగం పెంచారు. ఇంటీరియర్ పనులను తొందరగా పూర్తిచేసేందుకు సిబ్బంది కష్టపడుతున్నారు. అమర వీరుల స్తూపం, అంబేద్కర్ స్మృతి వనం పనులను కూడా వేగంగా పూర్తిచేయాలని అధికారులు సూచించారు.

వచ్చే ఏడాది నగరంలో జరగనున్న ఫార్ములా కార్ రేసింగ్ పోటీలకు దేశ విదేశాల నుంచి ప్రతినిధులు హైదరాబాద్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయం పనులు అసంపూర్తిగా కనిపించొద్దని, రేసింగ్ పోటీల లోపే పనులు పూర్తికావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆర్ అండ్ బీ అధికారులకు ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది.

  Last Updated: 29 Nov 2022, 02:32 PM IST