తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ(Distribution of New Ration Cards)కి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన తర్వాత పేద, మధ్య తరగతి ప్రజల ఆశలు మళ్లీ చిగురించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమవడంతో, రేషన్ కార్డు కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నవారు వెంటనే దరఖాస్తులకు సాగారు. మొదట మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించి, ఆన్‌లైన్‌లో అప్లై చేసిన వారికి త్వరితగతిన కార్డులు ఇచ్చారు. అయితే ఎక్కువ మంది దరఖాస్తు చేయడం, అధికారుల వద్ద పనుల నెమ్మది అవ్వడం తో కార్డుల జారీ వ్యవస్థకు బ్రేక్ పడినట్లు అయ్యింది.
ఈ జాప్యాన్ని దళారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. పాత కార్డుల్లో పేరు తొలగించడం నుంచి కొత్త దరఖాస్తు దాకా ప్రతి దశలో రూ.2000 నుంచి రూ.5000 వరకు వసూలు చేస్తూ కార్డులు అందిస్తున్నట్లు సమాచారం. కొంతమంది దళారులు మండల కార్యాలయాల్లో ఉన్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, ఆపరేటర్లతో కుమ్మక్కై నేరుగా కార్డులు జారీ చేయించుకుంటున్నారు. స్థానిక నాయకులు కూడా తమ అనుచరులకు మాత్రమే మద్దతు ఇస్తూ, కార్డులు సకాలంలో రావడానికి వీలుగా జోక్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు అర్హులకు రేషన్ కార్డులు లేటవుతుండటంతో ప్రజల్లో అసహనం పెరుగుతోంది.
Rahul Gandhi : రాహుల్ గాంధీ గొప్ప మనసు..22 మంది చిన్నారులను దత్తత తీసుకున్న కాంగ్రెస్ నేత
అధికారులు నిబంధనల ప్రకారం.. ప్రతి దరఖాస్తుదారుని ఇంటికే వెళ్లి పరిశీలించి, వారి ఆదాయం, ఆస్తి, ఉద్యోగ స్థితిని ‘360 డిగ్రీ పోర్టల్’ ద్వారా చూసే పని చేస్తున్నారు. ఈ కారణంగా కార్డుల జారీ ఆలస్యం అవుతోంది. దరఖాస్తు చేసిన 15 రోజుల్లోపు కార్డులు వస్తాయని చెప్పినా, కొన్ని కేసుల్లో 20 రోజులైనా వారం పడుతుండటంతో, దళారుల సహాయం కోరడం తప్పడం లేదు. డబ్బులు పెట్టి ముందుగా దరఖాస్తు చేసినవారికంటే ఆలస్యంగా అప్లై చేసినవారికి ముందే కార్డులు రావడం వల్ల సరైన పర్యవేక్షణ లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఎప్పుడు వస్తుందోనన్న ఆందోళనలో ప్రజలు త్వరగా కార్డు పొందాలని పోటీపడుతున్నారు. రేషన్ కార్డుతోనే సన్న బియ్యం, రుణ మాఫీ, భవిష్యత్తులో వచ్చే సౌభాగ్య లక్ష్మీ వంటి పథకాల బెనిఫిట్లు లభిస్తాయన్న దృష్టితో ప్రతి కుటుంబం సపరేట్ కార్డులకు అప్లై చేస్తోంది. ముఖ్యంగా మహిళలు తమ పేరుతో కార్డులు వచ్చేటట్లుగా కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నారు. మొత్తం మీద కొత్త రేషన్ కార్డుల ప్రక్రియకు అవినీతి, అశాంతి ముప్పుతిప్పులుగా మారుతోంది.