రామోజీ ఫిలింసిటీలో 45 నిమిషాలు అమిత్ షా ఉండటం, రాత్రికి జూనియర్ ఎన్టీఆర్ , షా భేటీ, మంగళవారం ఏపీ సీఎం జగన్, మోడీ సమావేశం ఇవన్నీ చూస్తే ఏదో అనూహ్య పరిణామం జరుగుతుందని అనుమానం రావటం సహజం. ఫిల్మ్ సిటీ లో 45 నిమిషాల పాటు షా ఉండే సమయంలో టీడీపీ మాజీ ఎంపీ ఉంటారని తెలుస్తుంది. ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. చంద్రబాబు కుటుంబానికి ఆ మాజీ ఎంపీ సన్నిహితుడు. ఇవన్నీ చూస్తే టీడీపీ, బీజేపీ దగ్గర అయ్యేలా కనిపిస్తుంది. కానీ, జూనియర్ తో షా విందు రాజకీయం అంతు పట్టడం లేదు. చంద్రబాబుకు ఇటీవల జూనియర్ దూరంగా ఉంటున్నారు. తెలంగాణ టీడీపీ ని ఆయన చేతుల్లో పెట్టడానికి చాలా సందర్భాల్లో బాబు ప్రయత్నం జరిగింది. కానీ , ఆయన వ్యూహం ఫలించలేదు. ఫిల్మ్ సిటీ కేంద్రంగా ఆ వ్యూహాన్ని షా ద్వారా రక్తికట్టించే ప్రయత్నం జరుగుతుందా? అంటే ఏమో రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.
ఏపీలో పొత్తు తెలంగాణలో సహకారం దిశగా టీడీపీ ని ఉపయోగించుకోవాలని షా అండ్ టీం భావిస్తుందని టాక్. ఆ విషయం పక్కాగా ఫిల్మ్ సిటీ కేంద్రంగా చర్చ జరుగుతుందని తెలుస్తుంది. కేవలం బాబు మద్దతు వల్ల పెద్దగా తెలంగాణలో ఉపయోగం ఉండదని బీజేపీ అంచనా. అందుకే జూనియర్ ను రంగంలోకి దింపాలని షా కు కొందరు మాజీ టీడీపీ ప్రస్తుత బీజేపీ లీడర్లు సూచించారని సమాచారం. అదే జరిగితే అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ రెండు పార్టీలకు లాభంగా లెక్కిస్తున్నారు. అయితే , పూర్తిగా చంద్రబాబును విశ్వాసంలోకి తీసుకోవటం లేదట. జూనియర్ ద్వారా అనూహ్య మలుపు రెండు రాష్ట్రాల్లో తిప్పాలని బీజేపీ స్కెచ్. అది ఎలా ఉంటుందో షా, మోడీ ద్వయానికి మాత్రమే ఎరుక.
స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబం అంటే తొలినుంచి బీజేపీకి అభిమానం. అందుకే 2014 ఎన్నికల్లో ఎన్టీఆర్ పేరును పదేపదే మోడీ ప్రస్తావించారు. ఆ తరువాత బాలకృష్ణను ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిచి మాట్లాడారు. 2019 ఎన్నికల నుంచి చంద్రబాబు దూరం జరిగినప్పటికీ నందమూరి కుటుంబంతో బీజేపీ సంబంధాలు నెరుపుతుంది. ప్రస్తుతం పురంధరేశ్వరి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. జూనియర్ అంటే తొలి నుంచి ఆమెకు ప్రత్యేక అభిమానం. ఒకానొక సందర్భంలో 2019లో ఇద్దరు కలిసి ప్రచారం బీజేపీకి చేస్తారు అని కూడా ప్రచారం జరిగింది. పైగా వాళ్ళిద్దరి ఉమ్మడి రాజకీయ శత్రువు చంద్రబాబు . ఆ విషయం వాళ్ళు పైకి చెప్పనప్పటికి టీడీపీలో ఎవర్ని అడిగిన చెబుతారు. ఇలా కుటుంబ, రాజకీయ పరిస్థితులపై అధ్యయనం చేసిన షా నందమూరి కుటుంబాన్ని దగ్గరకు తీసుకోవాలని భారీ స్కెచ్ వేశారని తెలుస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీలోకి జూనియర్ వెళతారా? మద్యే మార్గంగా నందమూరి కుటుంబానికి టీడీపీని దీర్ఘకాలంలో అప్పగించే ట్విస్ట్ షా? ఇస్తారా? అనేది పెద్ద ప్రశ్న.
ఇదంతా ఇలా ఉంటే, జూనియర్ ,షా భేటీ ఖరారు అయిన నిమిషాల్లో ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ షెడ్యూల్ ఖరారు అయింది. సర్వేల్లో వెనుకపడిపోతున్న జగన్ కు సమాంతరంగా బీజేపీ అడుగులు వేస్తున్న క్రమంలో వైసీపీలో హైరానా మొదలైందని టాక్. అందుకే హడావిడిగా ఢిల్లీ వెళ్లి మోడీని ప్రసన్నం చేసుకోవడానికి జగన్ సిద్ధం అయ్యారని తెలుస్తుంది. రెండు రోజులు అక్కడే ఉండి షా, మోడీని కలిసే షెడ్యూల్ జగన్ పెట్టుకున్నారు. మంగళవారం మోడీ ని కలిసే అపాయింట్మెంట్ ఫిక్స్ అయిందని వైసీపీ చెబుతుంది. కానీ ,షా టైం దొరకలేదని తెలుస్తోంది. రాజకీయ అంశాలపై మాత్రమే ఆయన ఢిల్లీ వెళ్తున్నారని తెలుస్తుంది. ఒక వైపు పవన్ ను దూరంగా పెడుతున్న బీజేపీ జూనియర్ కు దగ్గర కావాలని ప్రయత్నం చేయటం జనసేనకు భోధపటడం లేదు. మొత్తం మీద జూనియర్, షా భేటీ పలు సందేహాలకు, ప్రశ్నలకు వేదిక అయింది.
Political Game: జూనియర్, షా భేటీ సీక్రెట్ ఇదే!

Jagan, Amit Shah, Jr Ntr