New Party : ద‌క్షిణ, సెంట్ర‌ల్ తెలంగాణ‌లో కొత్త పార్టీ బ్లూ ప్రింట్ ?

ప్ర‌త్యేక వాదం స‌మ‌యంలోనే ద‌క్షిణ తెలంగాణ నినాదం(New Party) ఉంది.ఆ రోజున ద‌క్షిణ తెలంగాణ వెనుక‌బాటు గురించి పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది.

  • Written By:
  • Publish Date - May 31, 2023 / 03:36 PM IST

తెలంగాణ రాష్ట్రం ప్ర‌త్యేక వాదం స‌మ‌యంలోనే ద‌క్షిణ తెలంగాణ నినాదం(New Party) ఉంది. ఆ రోజున ద‌క్షిణ తెలంగాణ వెనుక‌బాటు గురించి పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మంలో క‌రీంన‌గ‌ర్‌, వరంగ‌ల్ ముందున్నాయి. ఆ దిశ‌గా కేసీఆర్ (KCR)అడుగులు వేస్తూ ఉత్త‌ర తెలంగాణ వ్యాప్తంగా ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మాన్ని ర‌క్తిక‌ట్టించారు. అదే, ద‌క్షిణ తెలంగాణ‌కు(South Telangana) చెందిన ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, రంగారెడ్డి, హైద‌రాబాద్ జిల్లాల్లో పెద్ద‌గా సెంటిమెంట్ లేదు. అందుకే, టీఆర్ఎస్ పార్టీకి వరంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్ మిన‌హా ఎక్క‌డా తొలి రోజుల్లో ప్రాబ‌ల్యం పెద్ద‌గా లేదు.

ద‌క్షిణ తెలంగాణ అస్త్రాన్ని విర‌స‌ర‌డానికి కొత్త పార్టీ ఆవిర్భావం (New Party)

ప్ర‌త్యేక రాష్ట్రం తీసుకురావ‌డానికి కాంగ్రెస్ పార్టీ చేసిన కృష్టి అంద‌రికీ తెలిసిందే. కానీ, ఆ పార్టీ ప్రచారం చేసుకోవ‌డంలో వెనుక‌బ‌డింది. కేవ‌లం ఇద్ద‌రు ఎంపీలున్న టీఆర్ఎస్ పార్టీని చూసి తెలంగాణ రాలేద‌న్న విష‌యం ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేయ‌డంలో విఫ‌లం అయింది. పైగా కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ను విలీనం చేస్తాన‌ని కేసీఆర్ అప్ప‌ట్లో న‌మ్మించారు. దీంతో కేసీఆర్ ను రాజ‌కీయ శ‌త్రువుగా కాంగ్రెస్ పార్టీ అప్ప‌ట్లో చూడ‌లేదు. ఫ‌లితంగా తెలంగాణ జాతిపిత‌గా కేసీఆర్ మారారు. అదే ఒర‌వ‌డిని వేగంగా తీసుకెళుతూ పాతుకుపోయారు. విప‌క్షాల‌ను నిర్వీర్యం చేస్తూ ఆయ‌న భావ‌జాలాన్ని తెలంగాణ స‌మాజం మీద రుద్దారు. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతోంది. కాద‌న్న వాళ్ల‌ను టార్గెట్ చేస్తూ మూడోసారి సీఎం కావ‌డానికి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు.

ఉత్త‌ర‌, ద‌క్షిణ తెలంగాణ యాస‌ల మ‌ధ్య 

ప్ర‌త్యేక వాదాన్ని వ‌దిలేసి జాతీయ వాదాన్ని వినిపిస్తోన్న కేసీఆర్ వెంట తెలంగాణ స‌మాజం ఉంద‌న్న భావ‌న బ‌లంగా ఉంది. అంటే, ఏ స్థాయిలో కేసీఆర్ ప్ర‌త్యేక రాష్ట్ర సెంటిమెంట్ ను తెలంగాణ స‌మాజం మీద పెట్టారు అనేది బోధ‌ప‌డుతోంది. ఆయ‌న ఫ‌క్తు రాజ‌కీయాలు చేస్తానంటూ చెబుతున్నా, తెలంగాణ స‌మాజం ఆయ‌న వెంట ఉంది. అంటే, ఎంత న‌మ్మ‌కం కేసీఆర్ క‌లిగించారో అర్థ‌మ‌వుతోంది. కానీ, తొలి నుంచి ఆయ‌న మాట‌ల గార‌డీని ద‌క్షిణ తెలంగాణ పెద్ద‌గా(New Party) ప‌ట్టించుకోలేదు. అంతేకాదు, సెంట్ర‌ల్ తెలంగాణ‌(రంగారెడ్డి, హైద‌రాబాద్) వాసులు కూడా న‌మ్మ‌లేదు. అందుకే, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల‌కు ద‌శాబ్దం పాటు దూరంగా ఉన్నారు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత విప‌క్షాల‌ను నిర్వీర్యం చేసి, గ్రేట‌ర్ లోకి టీఆర్ఎస్ ఎంట్రీ ఇచ్చింది.

ద‌క్షిణ తెలంగాణ‌, సెంట్ర‌ల్ తెలంగాణ వ‌ర‌కు కొత్త పార్టీ వాయిస్

కేవ‌లం ఉత్త‌ర తెలంగాణ ప్ర‌జ‌లు ఇచ్చిన బ‌లంతో రాజ‌కీయ న‌డుపుతోన్న కేసీఆర్ పై ద‌క్షిణ తెలంగాణ అస్త్రాన్ని విర‌స‌ర‌డానికి కొత్త పార్టీ ఆవిర్భావం (New Party) జ‌రుగుతోంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. వాస్త‌వంగా ద‌క్షిణ‌, ఉత్త‌ర తెలంగాణ ప్రాంతాల మ‌ధ్య తెలుగు యాస స‌రితూగ‌దు. ఉత్త‌ర తెలంగాణ భాష‌లోని యాస పూర్తి భిన్నం. ఆంధ్ర, తెలంగాణ తెలుగు నుడికారాల మ‌ధ్య ఎంత వ్య‌త్యాసం ఉందో, ఇంచుమించు అంతే ఉత్త‌ర‌, ద‌క్షిణ తెలంగాణ యాస‌ల మ‌ధ్య ఉంది. అంతేకాదు, సంస్కృతి, సంప్ర‌దాయాలు కూడా భిన్నంగా ఉంటాయి. అందుకే, కొత్త పార్టీని పెట్ట‌డం ద్వారా ద‌క్షిణ తెలంగాణ ప్రాబ‌ల్యాన్ని పెంచాల‌ని కొంద‌రు ముందుకు అడుగులు వేస్తున్నారు. ఆ జాబితాలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూప‌ల్లి కృష్ణారావు, కోదండ‌రాంరెడ్డి, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి త‌దిత‌ర ఉద్ధండులు సిద్ద‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే టీఆర్ఎస్ పార్టీని రిజిస్ట్ర‌ర్ చేసిన విష‌యం విదిత‌మే. ఆ పార్టీ త‌ర‌పున వీళ్లంతా ఒక వేదిక‌పైకి వ‌స్తారా? అనే టాక్ కూడా ఉంది.

Also Read : BRS Lose: ఆ ఎమ్మెల్యేలకు టికెట్స్ ఇస్తే.. 14 సీట్లు ఓడిపోవడం పక్కా!

బ‌ల‌మైన లీడ‌ర్లు ద‌క్షిణ తెలంగాణ‌లో ఉన్నారు. వాళ్ల‌ను కాద‌ని కేసీఆర్ సుదీర్ఘ రాజ‌కీయ న‌డుపుతున్నారు. ఇప్పుడు కొత్త పార్టీ పెట్ట‌డం(New Party) ద్వారా కింగ్ మేక‌ర్ కావాల‌ని భావిస్తున్నారు. రాష్ట్రం కోసం మాత్ర‌మే పెడుతోన్న పార్టీగా ఫోక‌స్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన త‌రువాత కేసీఆర్ జాతీయ స్థాయి ఆలోచ‌న‌లు చేస్తున్నారు. ఆ క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు, ప్రాధాన్య‌త‌ల‌ను పక్క‌న పెడుతున్నార‌న్న భావ‌న ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డానికి సిద్ద‌మ‌వుతున్నారు. అన్ని రంగాలు తెలంగాణ‌లో `వెల‌మ‌` సామాజిక‌వ‌ర్గం ప‌రిధిలోకి వెళ్లాయ‌ని, క‌ల్వ‌కుంట్ల క‌బంధ హ‌స్తాల్లోకి రాష్ట్రం వెళ్లింద‌న్న ప్ర‌చారాన్ని ముమ్మ‌రంగా చేయ‌డం ద్వారా కొత్త పార్టీని ఎలివేట్ చేయాల‌ని ఎజెండాను ఫిక్స్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. ద‌క్షిణ తెలంగాణ‌, సెంట్ర‌ల్ తెలంగాణ వ‌ర‌కు కొత్త పార్టీ వాయిస్ బ‌లంగా వెళ్లినా కింగ్ మేక‌ర్ కావొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల కంటే ఈ ప్రాంతాల్లో కేసీఆర్ చెప్పిన సెంటిమెంట్ పెద్ద‌గా లేద‌ని భావిస్తున్నారు. అందుకే, ద‌క్షిణ‌, సెంట్ర‌ల్ తెలంగాణ నుంచి కేసీఆర్ మీద వ్య‌తిరేక అస్త్రాల‌ను ఎక్కుపెట్ట‌డానికి కొత్త పార్టీ ఆవిర్భావం కానుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read : KCR Governament : వరంగ‌ల్ సెంట్ర‌ల్ జైలు తాక‌ట్టు! RBIకి ఫిర్యాదు