పర్యావరణహిత ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూకట్‌పల్లి డిపో నుంచి 60 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 960 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, వాటిలో 545 బస్సులు హైదరాబాద్ నగర పరిధిలోనే సేవలందిస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకం కింద అదనంగా 2,200 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని.. 2027 నాటికి మొత్తం 3,000 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
3,000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను 600 టన్నుల వరకు తగ్గించే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. హైదరాబాద్ నగరం ఢిల్లీ తరహా వాయు కాలుష్య సమస్యలను ఎదుర్కోకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రస్తుతం టీజీఎస్‌ఆర్టీసీ మొత్తం 10 వేల బస్సులను నడుపుతూ జంట నగరాల్లో ప్రతిరోజూ సుమారు 35 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోందని చెప్పారు. అలాగే కేపీహెచ్‌బీలో కొత్త బస్ డిపో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఉద్యోగుల సంక్షేమం, మహిళల కోసం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం వంటి అంశాలపై కూడా మంత్రి స్పందించారు. మహిళా ప్రయాణికులు ఇప్పటివరకు 310 కోట్ల ఉచిత టిక్కెట్లను వినియోగించుకున్నట్లు వెల్లడించారు.
