Site icon HashtagU Telugu

RS Praveen : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కొత్త చిక్కు..?

Rs Praveen

Rs Praveen

బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen) చిక్కులో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఆయన పేరును కూడా జాబితాలో చేర్చారు. ఫోన్ ట్యాపింగ్‌కు గురైనవారి వాంగ్మూలాలు సేకరిస్తున్న సమయంలో ఆయనను కూడా విచారణకు పిలిచారు. కానీ ఆయన మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. గతంలో బీఎస్పీ నేతగా ఉన్నప్పుడు తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించిన ప్రవీణ్, ఇప్పుడు ఆ ఆరోపణలే తిరిగి తనను దెబ్బ తీసేలా మారుతున్నాయి.

ఇటీవల సిట్ విచారణలో భాగంగా పలువురు బాధితులు హాజరై తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని వివరించారు. వారు తాము ఎదుర్కొన్న మానసిక ఒత్తిడిని మీడియా ముందు కూడా వెల్లడి చేశారు. కుటుంబ సభ్యులతో జరిగిన వ్యక్తిగత సంభాషణలు కూడా విన్నారని, ఇది ఎంతో దిగజారిన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇలాంటి అనుభవమే ఎదుర్కొనివుండవచ్చని అంటున్నారు. కానీ ప్రస్తుతం ఆయనే ఆ పార్టీ సభ్యుడిగా ఉండడం వల్ల బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేయలేని పరిస్థితిలో ఉన్నారు.

Sleeping Prince : 20 ఏళ్ల కోమా తర్వాత ముగిసిన “స్లీపింగ్ ప్రిన్స్” జీవన గాథ!

ప్రవీణ్ కుమార్ ప్రభుత్వ సేవలో ఉండగా విద్యా రంగానికి అనుబంధంగా హాస్టళ్ల నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. అక్కడే “స్వేరో” అనే ఉద్యమాన్ని ప్రారంభించి, సామాజిక న్యాయం కోసం పనిచేశారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బీఎస్పీలో కొనసాగి, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మార్పుతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రత్యేకించి తాను కక్షతత్వ పాలనలో టార్గెట్ అయినట్టు ఆరోపించిన నాయకుడే, ఇప్పుడు అదే పార్టీకి చెందినవాడిగా ఉండటం రాజకీయంగా కలత కలిగించే అంశమవుతోంది.

ఇప్పుడు ట్యాపింగ్ అంశంలో ఆయన ఎలాంటి ప్రకటన చేయాలన్నా, రాజకీయంగా సంక్లిష్ట పరిస్థితి నెలకొంది. సిట్ ముందు హాజరైతే – ఆ టైంలో ట్యాపింగ్ జరిగింది అన్నది ఒప్పుకున్నట్టవుతుంది. అదే హాజరు కాకపోతే బాధితుడిగా కాకుండా సైలెంట్‌గా వ్యవహరించినట్టవుతుంది. ఈ పరిస్థితి ఆర్ఎస్ ప్రవీణ్‌ను మౌనంగా మగ్గేలా చేస్తోంది. రాజకీయంగా ఆయన ఎంత గట్టిగా పోరాడతారో, లేక పరిస్థితులను తట్టుకుంటారో చూడాల్సిందే.

Exit mobile version