తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. కాసాని 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాసాని గతంలో ఎమ్మెల్సీగా, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మెన్ గానూ పనిచేశారు. తాజాగా కాసాని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
ఈ మేరకు చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును టీడీపీ పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు. ఇక కాసాని ఈనెల 10న టీడీపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో బాధ్యతలు చేపట్టనున్నారు.
తెలుగు రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోయిన తర్వాత టీడీపీలోనే కొనసాగారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసానికి ఆ వర్గంతో పాటు తెలంగాణలో మంచి పట్టు ఉంది. చాలా కాలం పాటు పార్టీకి దూరంగా ఉన్న కాసాని ఇటీవలే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ గూటికి చేరిన వెంటనే ఆయనకు పార్టీ రాష్ట్ర పగ్గాలు దక్కడం గమనార్హం.