Neem Tree : వేపచెట్టును రక్షిద్దాం.. సహజ సంజీవనికి జీవంపోద్దాం!

చెట్టు అనగానే చాలామందికి మొదటగా గుర్తుకువచ్చేది వేపనే. ఈ చెట్టు ఇంటి ముందుంటే ఎన్నో లాభాలు. అనేక రోగాలకు కూడా నయంచేస్తుంది. అందుకే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటి ముందు ఓ వేపచెట్టయినా ఉంటుంది.

  • Written By:
  • Updated On - November 17, 2021 / 05:11 PM IST

చెట్టు అనగానే చాలామందికి మొదటగా గుర్తుకువచ్చేది వేపనే. ఈ చెట్టు ఇంటి ముందుంటే ఎన్నో లాభాలు. అనేక రోగాలకు కూడా నయంచేస్తుంది. అందుకే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటి ముందు ఓ వేపచెట్టయినా ఉంటుంది. ఎర్రటి ఎండలో చల్లనిగాలినిచ్చే వేప అంటే అందరికీ ఇష్టమే. మరి అలాంటి చెట్టు ఎందుకు ఎండుతుంది? ఏదైనా వ్యాధి సోకింది? అనే విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అకస్మాత్తుగా ఏమైందో ఏమోకానీ.. పెద్ద పెద్ద చెట్లు సైతం ఎండిపోయి ఉనికిని కోల్పోయే ప్రమాదంలో ఉన్నాయి. సుమారు నెల రోజులుగా పరిస్థితి ఇలాగే ఉంది. కొందరు రోగం పట్టిందని భావించి చెట్లను నరికేస్తున్నారు.

హైదరాబాద్ తోపాటు రంగారెడ్డి,నల్గొండ, మహబూబ్ నగర్, అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో చెట్లన్నీ నిర్జీవంగా మారిపోతున్నాయి . ఏ గ్రామంలో ఎక్కడ చూసినా అకస్మాత్తుగా చెట్ల లేటు చిగుళ్ల నుంచి కొమ్మల వరకు మాడిపోతున్నాయి.కొన్ని చోట్ల వేప చెట్లు వాటి ఆకులు, కొమ్మలు ఎండిపోయి  పసుపు, గోధుమ రంగులోకి మారతూ క్షినిస్తున్నాయి. మామూలు చెట్టు అయితే గాలి పాటుకు ఏదో అయిందని అనుకోవచ్చు. కానీ వేప విషయంలో అలా అనుకోవడానికి లేదు. చీడపీడల కు విరుగుడు గా ఉపయోగపడే వేప వృక్షాలే ఇలా ఎందుకు తెగుళ్ల బారిన పడుతున్నాయి..? తెలంగాణలో హరితహారం, ఆంధ్రప్రదేశ్లో వనం మనం కార్యక్రమం కింద నాటిన మొక్కలన్ని ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చినవే. అవన్నీ కర్ణాటక, గోవా, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి తెచ్చినవే కావడంతో ఆయా ప్రాంతాల నుంచి వ్యాధి కారకాలు వచ్చినట్లు తెలుస్తోంది.

వాతావరణ ప్రభావంతో ఇలా జరుగుతోందని అధికారుల ద్వారా తెలియవచ్చింది. కష్టపడి ఏళ్ల తరబడి ఎంతో మక్కువతో పెంచుకున్న చెట్లను, కారణం తెలుసుకోకుండా నరికేయొద్దని స్థానిక వనసిరి ఫౌండేషన్‌ ప్రతినిధులు వివిధ ప్రకటనల ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అనేక మంది పెడచెవిన పెడుతుండటంతో ఫౌండేషన్‌ ప్రతినిధులు అటవీ, ఉద్యానవన శాఖల అధికారులను, నిపుణులను రప్పించి చూపారు.

వాతావరణంలో ఏర్పడిన మార్పు కారణంగా చెట్టు కొంతమేర ఇలా ఎండిపోతోందని, కొద్దిరోజులు వేచిఉంటే తిరిగి చిగురిస్తుందని అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ శాఖ వేపచెట్టును రక్షించే పద్ధతులపై అవగాహన కల్పిస్తోంది. వేప చెట్లు ఏ మందులు వాడాలి? ఎలాంటి పద్ధతులు పాటించాలి? అనే విషయాలపై సమగ్ర అవగాహన కల్పిస్తోంది.