క్యాన్సర్ కోరల్లో తెలంగాణ.. 2025 నాటికి 6 వేలమందికి క్యాన్సర్!

తెలంగాణ ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారా..? క్యాన్సర్ తో బాధపడేవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందా.. ? అంటే అవునని అంటోంది ఇండియన్ మెడికల్ సర్వీస్. 2020 లో గణాంకాలతో పోలిస్తే 2025 లో తెలంగాణలో దాదాపు 6,000 మందికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది

  • Written By:
  • Updated On - January 19, 2022 / 04:34 PM IST

తెలంగాణ ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారా..? క్యాన్సర్ తో బాధపడేవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందా.. ? అంటే అవునని అంటోంది ఇండియన్ మెడికల్ సర్వీస్. 2020 లో గణాంకాలతో పోలిస్తే 2025 లో తెలంగాణలో దాదాపు 6,000 మందికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. 2020 లో 47,620 మందికి క్యాన్సర్ ఉన్నట్లు అంచనా వేయగా,  ఆ సంఖ్య 2025లో 53,565 కు పెరిగే అవకాశాలున్నాయి. ఐదేండ్లలో దాదాపు 6 వేల మందికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్’ విడుదల చేసిన రిపోర్ట్స్ ఆధారంగా .. క్యాన్సర్ తో బాధపడేవాళ్ల సంఖ్య పెరిగిపోతోందట. ఈ విషయమై పీబీసీఆర్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ జి. సదాశివుడు మాట్లాడుతూ హైదరాబాద్‌లోని ప్రముఖ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్స్, ల్యాబ్‌ల నుంచి డేటాను తీసుకున్నామని, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుందని చెప్పారు. నిమ్స్, ఇండోఅమెరికన్ క్యాన్సర్, ఎంఎన్ జే ఆస్పత్రుల నుంచి నివేదికల ప్రకారం మహిళల్లో రొమ్ము క్యాన్సర్ 35.5శాతం, గర్భాశయం ద్వారా 8.7 శాతం, అండాశయం ద్వారా 6.9 శాతం ద్వారా వస్తే, పురుషుల్లో మాత్రం నోటి ద్వారా 13.3 శాతం ఊపిరితిత్తుల ద్వారా 10.9 శాతం, నాలుక ద్వారా 7.9శాతం క్యాన్సర్ వస్తున్నట్లు ఆయన తెలిపారు.

పోగాకు నమలడం, మద్యం సేవించడం, సరైన ఆహార నియమకాలు పాటించకపోవడం కారణంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయట. అయితే చాలామంది క్యాన్సర్ వచ్చినప్పటికీ చాలా ఆలస్యంగా గుర్తిస్తున్నారు. ప్రారంభ దశలోనే క్యాన్సర్ గుర్తిస్తే.. దీన్ని నుంచి బయటపడొచ్చు. తరచుగా వ్యాయామాలు చేయడం, యోగా లాంటివి చేస్తే కచ్చితంగా క్యాన్సర్ కు దూరంగా ఉండొచ్చు.