Telangana : ఎమ్మెల్యేల హ‌త్య‌కు మావోల రెక్కీ, ఛేదించిన పోలీస్‌!

చాప‌కింద‌నీరులా మావోయిస్టుల క‌ద‌లిక ఉంద‌ని పోలీసులు గ్ర‌హించారు. ముగ్గురు ఎమ్మెల్యేల‌ను కాల్చేయాల‌ని ప్లాన్ చేసిన మావోయిస్టుల కుట్ర‌ను భ‌గ్నం చేశారు

  • Written By:
  • Publish Date - September 29, 2022 / 03:17 PM IST

చాప‌కింద‌నీరులా మావోయిస్టుల క‌ద‌లిక ఉంద‌ని పోలీసులు గ్ర‌హించారు. ముగ్గురు ఎమ్మెల్యేల‌ను కాల్చేయాల‌ని ప్లాన్ చేసిన మావోయిస్టుల కుట్ర‌ను భ‌గ్నం చేశారు. దీంతో ఒక పెద్ద ఉప‌ద్ర‌వం తెలంగాణ ప్ర‌భుత్వానికి త‌ప్పింది. ఒక‌ప్పుడు ప్ర‌తి రోజూ ఏదో ఒక మూల మావోస్టుల క‌ద‌లిక‌లు ఉండేవి. తెలంగాణ ఏర్ప‌డిన త‌రువాత న‌క్స‌ల్స్ సిద్ధాంత‌మే టీఆర్ఎస్ సిద్దాంతం అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఇటీవ‌ల వ‌ర‌కు మౌనంగా ఉన్నారు. కానీ, ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం అరాచ‌కాలు పెరిగిపోవడంతో ముగ్గురు ఎమ్మెల్యేల‌ను మావోయిస్టులు టార్గెట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

ఉత్తర తెలంగాణ గోదావరి తీరంలో మావోయిస్టులు అలజడిని ముందుగానే పోలీసులు గుర్తించారు. బెల్లంపల్లి, చెన్నూర్, రామగుండం ఎమ్మెల్యేలు వ‌రుస‌గా దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్, కోరుకంటి చందర్‌ను హతమార్చేందుకు రెక్కీ నిర్వ‌హించారు. కానీ, వాళ్ల‌ను ఏ త‌ర‌హా ప్లాన్ తో హ‌త‌మార్చాల‌ని రెక్కీ నిర్వ‌హించారో పోలీసుల‌కు అంత‌బ‌ట్ట‌ని అంశంగా ఉంది. బ‌హుశా టైమ్‌బాంబు తరహాలో దాడి చేసే వ్యూహం దాగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఉత్తరాన మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్, కేంద్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్‌ ధర్మన్న రాష్ట్రంలోకి ప్రవేశించారన్న సమాచారం నిఘా వర్గాల వద్ద ఉంది. అందుకే, గోదావరికి ఇరువైపులా వీరి పోస్టర్లు వేసి ప్రజలను అప్రమత్తం చేశారు. రాజిరెడ్డి బసంత్‌నగర్‌ పరిసరాల్లో సంచరించడం వెనక కారణాలను గుర్తించారని తెలుస్తోంది. వైద్యం కోసం రాజిరెడ్డి ఈ ప్రాంతానికి వ‌స్తుంటార‌ని భావిస్తున్నారు. ఎన్టీపీసీ, ఎఫ్‌సీఐ, గోదావరిఖని పారిశ్రామికవాడల్లో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీల్లో సానుభూతిపరులు ఉండే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.

అగ్ర‌నేత‌లు రంగంలోకి దిగిన త‌రువాత కూడా ఎలాంటి హింస చోటుచేసుకోలేదు. వాళ్ల స్కెచ్ ఏంటి? అనేది ఇప్పుడు పోలీసులు అన్వేషిస్తున్నారు. పునర్వైభవంతోపాటు నిధులు, కేడర్‌ రిక్రూట్‌మెంట్ దిశ‌గా ఆరా తీస్తున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేల‌ను హ‌త‌మార్చ‌డం ద్వారా మావోయిస్టు పార్టీ ఉనికిని మ‌ళ్లీ వేగ‌వంతం చేయాల‌ని స్కెచ్ వేశారా? అనే కోణం నుంచి ద‌ర్యాప్తు జ‌రుగుతోంది. వాస్త‌వంగా టైమ్‌బాంబు పెట్టిన వ్యక్తి అది పేలే లోగా అక్కడ నుంచి తప్పించుకోవచ్చు. క్షేమంగా రాష్ట్ర సరిహద్దులు దాటే వరకూ హత్య లేదా హింస విషయాలు బయటకి రాకుండా జాగ్రత్త పడే అవకాశాలు ఉండే ఛాన్స్ ఉంది. అందుకే అనుమానితుల కదలికలపై పోలీసులు 24 గంటల నిఘా ఉంచారు.

మహారాష్ట్ర సరిహద్దును ఆనుకుని బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలుఉంటాయి. ఆ నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేలపై దాడి చేసి నిమిషాల్లోనే ప్రాణహిత నది దాటి మహారాష్ట్ర అటవీ ప్రాంతంలోకి పారి­పోయే వీలుంది. అదే రామగుండం ఏరియా మొత్తం మైదానప్రాంతం. ఇక్కడ ఎలాంటి హింసకు దిగినా వెంటనే పట్టుబడతారు. అందుకే, తొలుత చెన్నూరు,బెల్లంపల్లి ఎమ్మెల్యేలను మావో­యిస్టులు లక్ష్యంగా ఎంచుకున్నట్లు సమాచారం. కానీ, ఇద్దరూ దళిత ఎమ్మెల్యేల‌ను హ‌త‌మార్చితే ప్రజల్లో వ్యతిరేకత ఎదురవుతుందని వెన‌క్కు త‌గ్గార‌ని తెలుస్తోంది. చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేల విషయంలో ద‌ళిత కోణం, రామగుండం ఎమ్మెల్యే విషయంలో భౌగోళిక ప్ర‌తికూల‌త కార‌ణంగా రెక్కీ నిర్వ‌హించిన‌ప్ప‌టికీ దాడికి దిగ‌లేద‌ని పోలీసులు భావిస్తున్నారు.

సాంకేతిక ప‌రిజ్ఞానం పెర‌గ‌డం, నిఘా వ‌ర్గాలు అప్ర‌మ‌త్తం కార‌ణంగా గ‌తంలో మాదిరిగా సంచ‌ల‌న‌ హత్యలు, బహిరంగ దాడులకు మావోలు సాహసం చేయలేరు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మావోయిస్టులు టార్గెట్ చేసే ప‌రిస్థితి లేదు. ఫ‌లితంగా రెక్కీ వ‌ర‌కు వాళ్ల కార్య‌క‌లాపాలు ప‌రిమితం అవుతున్నాయి. కార్యరూపంలోకి రెక్కీని తీసుకురావ‌డం క‌ష్ట‌త‌రం. అందుకే, రెక్కీ వ‌ద్ద‌నే ముగ్గురు ఎమ్మెల్యేల హ‌త‌మార్చే మావోల స్కెచ్ ను విజ‌య‌వంతంగా తెలంగాణ పోలీసులు ఛేదించ‌గ‌లిగారు.