త్వరలో తెలంగాణ(Telangana) ఎలక్షన్స్(Elections) ఉన్న నేపథ్యంలో ఇటీవల బీఆర్ఎస్(BRS) దాదాపు అన్ని చోట్ల ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ని ప్రకటించింది. కొన్ని చోట్ల తప్ప 90 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మార్చిన ప్రదేశాలతో పాటు మరి కొన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ కు నిరసన ఎదురవుతుంది. కొన్ని చోట్ల పార్టీలో అసమ్మతి గళం వినిపిస్తుంది. ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మార్చాలని కొంతమంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ నియోజకవర్గాల్లో కూడా గ్రూపులుగా బీఆర్ఎస్ లో తమ నాయకుడినే ప్రకటించాలని నిరసనలు వస్తున్నాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ని ప్రకటించని నియోజకవర్గాల్లో మెదక్(Medak) జిల్లా నర్సాపూర్(Narsapur) కూడా ఉంది. అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి చిలుముల మదన్ రెడ్డి(Madan Reddy)ఉన్నారు. అయితే దాదాపు అన్ని నియోజకవర్గాలు ప్రకటించి తన నర్సాపూర్ లో ప్రకటించకపోవడంతో విచారం వ్యక్తం చేస్తున్నారు మదన్ రెడ్డి. తాజాగా నేడు ప్రెస్ మీట్ నిర్వహించారు.
నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. సిట్టింగ్ లో ఉన్న ఎమ్మెల్యేల అందరికీ టికెట్ ప్రకటించి నర్సాపూర్ టికెట్ ప్రకటించకపోవడం బాధ కలిగించింది. ఎమ్మెల్యేగా నర్సాపూర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాను. నాకు రాజకీయ బిక్ష పెట్టింది సీఎం కేసిఆర్. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై బాధ కలుగుతుంది. సీఎం కేసిఆర్ ఆదేశాలతో నర్సాపూర్ లో పార్టీని పటిష్టం చేశాను. బీఆర్ఎస్ నాయకుల మనోభావాలను పార్టీ కూడా గుర్తించాలి. నర్సాపూర్ స్థానం నాకే కేటాయించాలి. నర్సాపూర్ స్థానం విషయంలో పార్టీ పునరాలోచన చేయాలి. నేను సీట్ వదిలే ప్రసక్తే లేదు. నర్సాపూర్ నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధులు నాకే మద్దతుగా ఉన్నారు అని తెలిపారు.
అలాగే నర్సాపూర్ లో పార్టీనీ ముక్కలు చేయొద్దు. కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్లకు నాకన్న పెద్ద పదువులు ఇచ్చినా నాకు అభ్యతరం లేదు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇచ్చినా లేదా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా నేను మాత్రం ఎమ్మెల్యే పోటీలో ఉంటాను. నర్సాపూర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరూ ఓపికగా ఉండాలి అని ప్రెస్ మీట్ లో తెలిపారు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి. మరి దీనిపై బీఆర్ఎస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read : MLC Kavitha: కాంగ్రెస్ ప్రకటించింది దళిత డిక్లరేషన్ కాదు ఫాల్స్ డిక్లరేషన్: ఎమ్మెల్సీ కవిత