Site icon HashtagU Telugu

KTR Vs Mallanna : కిడ్స్..కిడ్డింగ్ పాలిటిక్స్..!

Devansh Himansh

Devansh Himansh

తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు కుమారుడు తారక రామారావు అలియాస్ మంత్రి కేటీఆర్. ఆయ‌న కుమారుడు హిమాన్ష్‌. యాదృచ్ఛిక‌మో..ఉద్దేశ్వ పూర్వ‌కమోగానీ..త‌ర‌చూ వార్త‌ల్లోకి ఎక్కుతున్నాడు. దానికి కార‌ణం ఎవ‌రు? ఎందుకు హిమాన్ష్ ను ప్ర‌త్య‌ర్థి పార్టీలు రాజ‌కీయ తెర‌మీద‌కు లాగున్నాయి? అనే ప్ర‌శ్న వేసుకుంటే, స‌మాధానం కోసం మూలాలుకు వెళ్లాల్సిందే.ఒకానొక స‌మ‌యంలో హిమాన్ష్ స‌చివాల‌యానికి వెళ్లాడు. ఆ రోజున ముహుర్తం బాగుంద‌నో..లేక ఉల్లాసం కోస‌మో తెలియ‌దుగానీ సీఎం కుర్చిలో కూర్చొన్నాడట‌. అప్ప‌ట్లో ఆ వార్త సంచ‌ల‌నం క‌లిగించింది. సీఎం కేసీఆర్ సీట్లో మ‌న‌వ‌డు హిమాన్ష్ కూర్చోవ‌డం అధికార దుర్వినియోగం కింద‌కు వ‌స్తుంద‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు దుమ్మెత్తి పోశాయి. ప్ర‌త్యేకించి ఆ విషయాన్ని కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి ప్ర‌స్తావించ‌డంతో సంచ‌ల‌నం క‌లిగించింది. భ‌ద్రాచ‌లం శ్రీరాముని క‌ల్యాణ త‌లంబ్రాలు హిమాన్ష్ మోసుకెళ్లాడు. ముఖ్య‌మంత్రి ప్రొటోకాల్ ప్ర‌కారం త‌లంబ్రాలు తీసుకెళ‌తారు. త‌ద్భిన్నంగా హిమాన్ష్ త‌లంబ్రాలు తీసుకెళ్లిన సంద‌ర్భాన్ని ప్ర‌త్య‌ర్థులు గుర్తు చేస్తున్నారు.

కేసీఆర్ మ‌న‌వ‌డు హిమాన్ష్ దేహ‌దారుఢ్యం గురించి రేవంత్ రెడ్డి ఒకానొక సంద‌ర్భంలో ప్ర‌స్తావించాడు. టీఆర్ఎస్ పై రాజ‌కీయ దాడి చేస్తోన్న క్ర‌మంలో కేసీఆర్ ముక్కు గురించి ప‌లుమార్లు రేవంత్ వ్యంగ్యాస్త్రాల‌ను సంధించాడు. అంతేకాదు, హిమాన్ష్ తిండి గురించి కూడా రాజ‌కీయ వేదిక‌ల‌పై మాట్లాడాడు. దాంతో ఆ రోజున టీఆర్ఎస్ పార్టీ నేత‌లు రేవంత్ పై విరుచుకుప‌డ్డారు. ఇదే విష‌యాన్ని కొన్ని టీవీ ఛాన‌ళ్ల ఇంట‌ర్వ్యూల్లో ప్ర‌స్తావించిన‌ప్పుడు హిమాన్ష్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వ‌చ్చిందో..ఆయ‌న వివ‌రించాడు. ఆ రోజు నుంచి హిమాన్ష్ ను ప‌క్క‌న పెట్టేసి క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీ మీద వ్య‌క్తిగ‌తంగా రేవంత్ వ్యంగ్యాస్త్రాల‌ను విసురుతున్నాడు.ఇక మాజీ సీఎం చంద్ర‌బాబు కుమారుడు మాజీ మంత్రి లోకేష్‌. ఆయ‌న కుమారుడు దేవాన్ష్. అత‌ను గురించి కూడా ఒకానొక సంద‌ర్భంలో రాజ‌కీయ ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. ప్ర‌త్య‌ర్థులో ప‌లుమార్లు దేవాన్ష్ ఆస్తుల గురించి మాట్లాడారు. అంతేకాదు, వార‌స‌త్వ రాజ‌కీయల గురించి దాడి చేసిన సంద‌ర్భాలు లేక‌పోలేదు. చంద్ర‌బాబు వార‌సునిగా లోకేష్ కాబోయే సీఎం అంటూ టీడీపీలోని కొంద‌రు చాలాసార్లు ప్ర‌స్తావించారు. ఆ సంద‌ర్భంగా లోకేష్ త‌రువాత కాబోయే సీఎం దేవాన్ష్ అంటూ వైసీపీ నేత‌లు వ్యంగ్యాస్త్రాల‌ను ఆనాడు సంధించారు.

ఇంట్లో పిల్ల‌ల‌ను కూడా వద‌ల‌కుండా రాజ‌కీయాల్లోకి లాగుతున్నార‌ని ఆనాడు టీడీపీ ప్ర‌తిదాడి చేసింది. అందుకు వైసీపీ ఇచ్చిన వివ‌ర‌ణ ఏమంటే, చంద్ర‌బాబునాయుడే ఆయ‌న మ‌న‌వ‌డి గురించి రాజ‌కీయ వేదిక‌ల‌పై ప్ర‌స్తావించాడ‌ని
గుర్తు చేశారు. 2019 ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా చంద్ర‌బాబు పలు వేదిక‌ల‌పై దేవాన్ష్ మాట ప్ర‌స్తావించాడు. ఏపీ రాష్ట్రం బాగుప‌డాలంటే, ఈసారి టీడీపీకి ఓటు వేయండని ఆనాడు పిలుపునిచ్చాడు. అదే ఫ్లోలో…ఓటు వేయ‌క‌పోతే వ్య‌క్తిగ‌తం త‌న‌కు పోయేదేమీలేద‌ని అన్నాడు. మీ భ‌విష్య‌త్‌..నా భ‌రోసా అంటూ స్లోగ‌న్ ఇచ్చాడు. ఒక వేళ ఓడిస్తే, దేవాన్ష్ తో ఇంట్లో ఆడుకుంటానని ప్ర‌చారం చివ‌రి స‌భ‌ల్లో ఆయ‌న అన్నారు. సీఎంగా ఉన్న రోజుల్లో కూడా ప‌రిపాల‌న‌లో బీజీగా మారిపోవ‌డంతో దేవాన్ష్ తో ఆడుకోవ‌డానికి టైం లేకుండా పోయింద‌ని య‌థాలాపంగా మాట్లాడాడు. ఆ మాట‌ల‌ను ప్ర‌త్య‌ర్థి పార్టీ వైసీపీ రాజ‌కీయ కోణం నుంచి దేవాన్ష్ ను తెర‌మీద‌కు తీసుకొచ్చింది. అదే కామెంట్ ను 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు మీద వ్యంగ్యంగా అనేక వేదిక‌ల‌పై వైసీపీ ప్ర‌యోగించింది.అటు హిమాన్ష్ ఇటు దేవాన్ష్ పేర్లు రాజ‌కీయ తెర మీద‌కు రావ‌డానికి మూల కార‌ణం వాళ్ల‌కు చెందిన కుటుంబాల‌ని చెప్పకుండా ఉండ‌లేం. అలాగ‌ని, తెలంగాణ అభివృద్ధా..హిమాన్ష్ శ‌రీర అభివృద్ధా..అంటూ బీజేపీ లీడ‌ర్ చింత‌పండు న‌వీన్ కుమార్ అలియాస్ తీర్మాన్ మ‌ల్ల‌న్న ఆన్ లైన్ స‌ర్వే పెట్ట‌డం రాజ‌కీయ పరాకాష్ట‌. అందుకే, తీవ్రంగా స్పందించిన టీఆర్ఎస్ శ్రేణులు మ‌ల్ల‌న్న మీద దాడికి దిగారు. ఇలా చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాదు. ప్ర‌స్తుతం పోలీస్ స్టేష‌న్లో ఈ కేసు న‌డుస్తోంది. భ‌విష్య‌త్ లో దేవాన్ష్‌, హిమాన్ష్ పేర్లు రాజ‌కీయ తెర‌మీద‌కు రాకుండా ఉండేలా హైద‌రాబాద్ పోలీస్ లు ఎలాంటి ఫుల్ స్టాప్ పెడ‌తారో చూడాల్సిందే!