Nagoba Jatara : ఆదివాసీ సమాజం ఐక్యతను పెంచే మహా జాతరగా నాగోబా..

Nagoba Jatara : ఆదివాసీల ఆరాధ్యదైవమైన నాగోబా (శేషనారాయణమూర్తి) ఆ నిమిషంలో పడగవిప్పి నాట్యం చేస్తాడని గిరిజన మెస్రం వంశీయులలో అపార నమ్మకం ఉంటుంది. జనవరి 28 పుష్యమాస అమావాస్య నాడు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నాగోబా ఆలయంలో గిరిజన పూజారులు తమ ఆరాధ్యదైవాన్ని దర్శించి, పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతారని గిరిజనుల విశ్వాసం.

Published By: HashtagU Telugu Desk
Nagoba Jatara 2025

Nagoba Jatara 2025

Nagoba Jatara : నాగోబా జాతర వేడుక ఆదివాసీ సమాజానికి ఒక ముఖ్యమైన పండుగ. ఈ జాతర ఆదివాసీ సమాజం ఐక్యతను పెంచే మహా జాతరగా ప్రత్యేకత సాధించింది. పుష్యమాస అమావాస్య అర్ధరాత్రి వేళ, నాగశేషుడికి గంగాజలాభిషేకంతో ఈ జాతర ప్రారంభమవుతుంది. ఆదివాసీల ఆరాధ్యదైవమైన నాగోబా (శేషనారాయణమూర్తి) ఆ నిమిషంలో పడగవిప్పి నాట్యం చేస్తాడని గిరిజన మెస్రం వంశీయులలో అపార నమ్మకం ఉంటుంది. జనవరి 28 పుష్యమాస అమావాస్య నాడు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నాగోబా ఆలయంలో గిరిజన పూజారులు తమ ఆరాధ్యదైవాన్ని దర్శించి, పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతారని గిరిజనుల విశ్వాసం.

నాగోబా జాతర ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచింది. ఈ జాతరలో ప్రత్యేకత సర్పజాతిని పూజించడం. రాత్రంతా నాగదేవతకు మహాపూజ నిర్వహించబడుతుంది. ఈ వేడుకలో భాగంగా జన్నారం మండలం కలమడుగుకు సమీపంగా గోదావరి నదీ జలాన్ని ప్రత్యేక కుండలలో తీసుకువచ్చి పూజ నిర్వహిస్తారు. తెల్లని దుస్తులు ధరించిన మెస్రం వంశీయులు కాలినడకన చేపట్టిన మహా పాదయాత్ర ఐదు మండలాలు, 18 గ్రామాలు, 26 మారుమూల గ్రామాలు గుండా సాగుతుంటాయి. ఈ పాదయాత్ర ప్రక్రియ మంత్రాల నడుమ నడుస్తూ మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో గోదావరి ప్రవాహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Velupillai Prabhakaran : త్వరలోనే జనం ముందుకు ఎల్టీటీఈ ప్రభాకరన్‌.. నిజమేనా ?

జలసేకరణ పాదయాత్ర కొండలు, అడవుల గుండా ప్రయాణించి, గోదావరి నదీ జలంతో నిండి తిరిగి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుంటుంది. అక్కడ నాగదేవతను ప్రార్థించి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటారు.

పూజా విధానంలో, అమావాస్య రోజున కలశం భద్రపరిచిన మర్రిచెట్టు వద్ద బావినీరు, మట్టి కలిపి పుట్టను తయారుచేసి, ఆలయంలో నాగదేవతను గంగాజలంతో అభిషేకిస్తారు. పూజాసమయంలో మొలకెత్తిన నవధాన్యాలు, పాలు కొత్త రుమాలుతో కప్పి పుట్టపైన ఉంచి పూజా కార్యక్రమం ప్రారంభం అవుతుంది. పూజా అనంతరం ఆలయ ఆవరణలో ఉన్న పుట్టను మెత్తగా చేస్తారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయుల అల్లుళ్లు ప్రత్యేకంగా తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తారు.

ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు హాజరవుతారు. పెద్ద సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొనటంతో, వారు వంట చేసేందుకు 22 పొయ్యిలపై వంట చేస్తారు. ఈ పొయ్యిలను ప్రత్యేకంగా ప్రహరీ గోడ లోపల ఏర్పాటు చేసి, దీపాలు వెలిగించి వంటసమ్మేళనాన్ని నిర్వహిస్తారు.

వధూవరుల పరిచయం చేసేందుకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తారు. నూతన వధువులను నాగోబా దేవుని వద్దకు తీసుకెళ్లి పూజ చేసి పరిచయం చేస్తారు. దీన్ని ‘భేటింగ్ కీయ్‌వాల్’ అంటారు.

జాతర సందర్భంగా ఏర్పడే దర్బార్‌కు ప్రత్యేక చరిత్ర ఉంది. 63 సంవత్సరాల క్రితం, గిరిజన ప్రాంతాల్లో పర్యటన చేసిన ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ జాతరలో దర్బార్‌ను ప్రారంభించారు. స్వాతంత్ర్యం తర్వాత, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో దర్బార్ కొనసాగుతుంది. ఈ దర్బారులో గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు.

Janasena : వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ మీద రుద్దొద్దు – నాగబాబు స్వీట్ వార్నింగ్

  Last Updated: 28 Jan 2025, 11:07 AM IST