Site icon HashtagU Telugu

King Nag: నాగ్ ‘గ్రీన్’ రివల్యూషన్.. 1,080 ఎకరాల అటవీ భూమి దత్తత!

Nag

Nag

ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పుట్టినరోజు సందర్భంగా  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో 1080 ఎకరాల అటవీ భూమిని తీసుకుంటున్నట్లు హీరో నాగార్జున ప్రకటించారు. హైదరాబాద్ శివారు చెంగిచర్ల అటవీ బ్లాక్ పరిధిలో తన తండ్రి, దివంగత ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వర రావు పేరు మీద అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటు కు ముందుకొచ్చారు. ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి చెంగిచర్లలో శంకుస్థాపన కార్యక్రమంలో నాగార్జున కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.  అక్కినేని నాగార్జున, అమల, కుమారులు నాగ చైతన్య, అఖిల్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అటవీ పార్కు అభివృద్ధికి ముఖ్యమంత్రి సంకల్పించిన హరిత నిధి (గ్రీన్ ఫండ్) ద్వారా రెండు కోట్ల రూపాయల చెక్ కు అటవీ శాఖ ఉన్నతాధికారులకు అందించారు.

మన పరిసరాలు, రాష్ట్రం, దేశం ఆకుపచ్చగా, పర్యావరణ హితంగా మారాలన్న సంకల్పంతో, తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో ఎం.పీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించారని, ఈ కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొని పలు సార్లు మొక్కలు నాటానని నాగార్జున తెలిపారు. గత బిగ్ బాస్ సీజన్ ఫైనల్ కార్యక్రమంలో అడవి దత్తతపై చర్చించానని, ఆ రోజు వేదికపై ప్రకటించినట్లు గానే ఇప్పుడు అటవీ పునరుద్దరణ, అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేయటం ఆనందంగా ఉందని నాగార్జున అన్నారు. ఈ అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న పట్టణ ప్రాంత కాలనీ వాసులకు పార్కు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా అడవి దత్తతకు నాగార్జున ముందకు రావటాన్ని ఎంపీ సంతోష్ కుమార్ ప్రశంసించారు. దేశంలో ఏ పెద్ద నగరానికి లేని ప్రకృతి సౌలభ్యత ఒక్క హైదరాబాద్ కే ఉందని, రాజధాని చుట్టూ ఉన్న లక్షా యాభై వేల ఎకరాలకు పైగా అటవీ భూమిని పరిరక్షించటం, పునరుద్దరణ చేయటం, అర్బన్ పార్కుల ఏర్పాటుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తమ వంతు ప్రయత్నం చేస్తుందని సంతోష్ అన్నారు. దీనికోసం సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చే ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

Exit mobile version