Minister Singireddy: అయోవా – తెలంగాణ రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం: మంత్రి సింగిరెడ్డి

మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తొలిరోజు అయోవా రాష్ట్ర రాజధాని డెమోయిన్ నగరంలో రాష్ట్ర లెఫ్టినెట్ గవర్నర్ ఆడమ్ గ్రెగ్ ను కలిశారు.

  • Written By:
  • Updated On - August 29, 2023 / 12:54 PM IST

Minister Singireddy: అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ వ్యసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తొలిరోజు అయోవా రాష్ట్ర రాజధాని డెమోయిన్ నగరంలో రాష్ట్ర లెఫ్టినెట్ గవర్నర్ ఆడమ్ గ్రెగ్ ను కలిశారు. తెలంగాణ రాష్ట్రం గత తొమ్మిదేళ్లలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాధిస్తున్న సర్వతోముఖాభివృద్ధి గురించి మంత్రి సింగిరెడ్డి గారు లెఫ్టినెంట్ గవర్నర్ ఆడమ్ గ్రెగ్ కు వివరించారు. వ్యవసాయిక రాష్ట్రంగా పేరుగాంచిన అయోవా రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి అనేక సారూప్యతలు ఉన్నాయి అన్నారు మంత్రి. రెండు రాష్ట్రాలూ ఆహారాధాన్యాల ఉత్పత్తు, పౌల్ట్రీ, మాంసోత్పత్తిలో నెంబర్ వన్ గా నిలిచాయని, భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య అనేక అంశాల్లో పరస్పర సహకారానికి అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.

భారత దేశంలో అతి పిన్న వయసున్న తెలంగాణ వ్యవసాయం నుండి ఐటీ రంగం వరకు అనేక రంగాల్లో స్ఫూర్తిదాయకమైన అభివృద్ధి కనబరుస్తున్నదని, దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దూరదృష్టి, నాయకత్వ పటిమనే కారణమని మంత్రి సింగిరెడ్డి పేర్కొన్నారు. ఒకప్పుడు ఎంతో దారుణమైన దుస్థితిలో ఉన్న స్థానిక రైతాంగం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మకమైన పథకాల వల్ల ఆర్థికంగా బలపడ్డారని మంత్రి వారికి వివరించారు.

తెలంగాణ వ్యవసాయ రంగంలో తీసుకుంటున్న అనేక విధాన నిర్ణయాల ఫలితంగా రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గణాంకాలతో సహా వివరించగా లెఫ్టినెంట్ గవర్నర్ ఆడమ్ గ్రెగ్ అమితాశ్చర్యానికి లోనయ్యారు. నిజంగానే తెలంగాణ సాధించిన విజయాలు గర్వించదగ్గవి అని గవర్నర్ గ్రెగ్ కితాబిచ్చారు. అయోవా – తెలంగాణ రాష్ట్రాలు వ్యవసాయ, అనుబంధ రంగాల్లో కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు అని ఆడమ్ గ్రెగ్ అభిప్రాయపడ్డారు. ఈ రోజు మధ్యాహ్నం మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అయోవా సెక్రటరీ ఆఫ్ అగ్రికల్చర్ మైక్ నెయిగ్ ను కలిశారు. తెలంగాణలో గత తొమ్మిదేళ్లలో వ్యవసాయం, అదాని అనుబంధ రంగాల్లో జరిగిన పురోగతి గురించి మంత్రి ప్రస్తావించారు.

అయోవాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్ చేసిన కృషి వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగి భారత్ వంటి అనేక దేశాలు తిండి గింజల విషయంలో స్వయం సంవృద్ధి సాధించాయని, ప్రపంచంలో 100 కోట్ల మంది ఆకలి తీర్చిన గొప్ప వ్యక్తి నార్మన్ బోర్లాగ్ వలెనే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్నమైన విధానాల రూపకల్పన ద్వారా ఈ నూతన రాష్ట్రాన్ని దేశానికి ఒక ధాన్యాగారంగా మార్చారని మంత్రి తెలిపారు. ముఖ్యంగా రికార్డు సమయంలో కాళేశ్వరం వంటి భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తి చేయడం ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు మార్గం సుగమం అయ్యిందని, లాగే రైతు బంధు వంటి పెట్టుబడి సాయం పథకం ద్వారా రైతులకు ఎంతో మేలు జరిగింది అని మంత్రి వివరించారు.

రాష్ట్రంలో రెండో హరిత విప్లవం ద్వారా ధాన్యం ఉత్పత్తి ఆరు రెట్లు పెరిగింది అని, అలాగే పాడి పరిశ్రమ అభివృద్ధి ద్వారా శ్వేత విప్లవం, చేపల పెంపకంలో వృద్ధి సాధించి నీలి విప్లవం, మాంసోత్పత్తిలో రికార్డు సృష్టించి పింక్ రెవల్యూషన్ సాధించిన తెలంగాణ, ఇప్పుదు నూనె గింజల ఉత్పత్తిలో నూతన శిఖరాలను చేరి పసుపు విప్లవాన్ని సాధించే దిశగా పురోగమిస్తున్నది అని మంత్రి అయోవా సెక్రటరీ ఆఫ్ అగ్రికల్చర్ మైక్ నెయిగ్ కు తెలిపారు. తెలంగాణ సాధించిన అయిదు విప్లవాల గురించి విన్న సెక్రటరీ మైక్ నెయిగ్ త్వరలోనే రాష్ట్రాన్ని సందర్శించి ఈ విజయాలను స్వయంగా చూస్తానని హామీ ఇచ్చరు.

అయోవా రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి కోసం తీసుకున్న చర్యల గురించి మైక్ ను మంత్రి నిరంజన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈరోజు సాయంత్రం అయోవా స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్ సందర్శించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి యూనివర్సిటీ ప్రెసిడెంట్ వెండీ వింటర్‌స్టీన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రపంచంలోనే పేరెన్నికగన్న వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో అయోవా స్టేట్ యూనివర్సిటీ ఒకటి.

ఈ సమావేశంలో అయోవా స్టేట్ యూనివర్సిటీ మరియు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ల నడుమ స్టూడెంట్ & ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ఉండాలని, ఇరు విశ్వవిద్యాలయాలు తాము చేస్తున్న పరిశోధనల విషయంలో కూడా పరస్పరం సహకరించుకోవాలనే చర్చ జరిగింది.  సమావేశానంతరం మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అయోవా స్టేట్ యూనివర్సిటీలో గల సీడ్ సైన్స్ సెంటర్ ను సందర్శించారు. అక్కడి శాస్త్రవేత్తలను విత్తన రంగంలో చేస్తున్న వివిధ పరిశోధనల గురించి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం విత్తనోత్పత్తిలో సాధించిన విజయాలు, దేశానికి సీడ్ హబ్‌గా తెలంగాణ నిలిచిన విషయం వారికి తెలిపారు. ఈ సమావేశాల్లో తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు పాల్గొన్నారు.

Also Read: AP Schools: టీచర్లకు జగన్ షాక్.. స్కూళ్లలో మొబైల్ ఫోన్లు నిషేధం