Site icon HashtagU Telugu

Bakrid : హైద‌రాబాద్‌లో ఘ‌నంగా బ‌క్రీద్ వేడుక‌లు… సాముహిక ప్రార్థ‌న‌లు చేసిన ముస్లిం సోద‌రులు

Bkarid

Bkarid

హైదరాబాద్‌: బక్రీద్ పర్వదినాన్ని ఆదివారం నగరవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. నగరంలోని వివిధ ఈద్గాలు, మసీదులలో వర్షం కురుస్తున్నప్పటికీ అనేక మంది ముస్లింలు ఈద్ సామూహిక ప్రార్థనలకు హాజరయ్యారు. మీర్ ఆలం ఈద్గా, ఖదీమ్ (పాత) ఈద్గా మాదన్నపేట్, మక్కా మసీదు, మాసబ్ ట్యాంక్ వద్ద హాకీ గ్రౌండ్స్ మొదలైన వాటిలో ప్రధాన సమ్మేళనాలు జరిగాయి. మీర్ ఆలం ఈద్గాలో మక్కా మసీదు ఖతీబ్ మౌలానా హఫీజ్ రిజ్వాన్ ఖురేషీ ఈద్ ఉల్ అదా ప్రార్థనలకు నాయకత్వం వహించారు. పలువురు ప్రముఖులు, మైనార్టీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ప్రార్థనల్లో పాల్గొన్నారు.

భద్రతా ఏర్పాట్లను సీనియర్ పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పశువులను బలి ఇచ్చేందుకు చివరి నిమిషంలో కొనుగోళ్లకు ఎగబడటంతో నగరంలో గొర్రెలు, పొట్టేలు, మేకలు, పశువుల విక్రయాలు కొనసాగుతున్నాయి. మంగళవారం వరకు ఈద్ వేడుకలు జరుగుతాయి. నగరంలో కసాయిల డిమాండ్ పెరిగింది. డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు పక్క జిల్లాలైన వికారాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో కసాయి వ్యాపారులు నగరంలోకి వచ్చారు.

బ‌క్రీద్ పండుగ సంద‌ర్భంగా ముస్లింలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్‌, ఇతర నేతలు శుభాకాంక్షలు తెలిపారు. నగరంలో శాంతిభద్రతలు నెలకొనేందుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని సున్నిత ప్రాంతాలలో పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, డీజీపీ కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు నగరంలో కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.

Exit mobile version