Asaduddin : బీఆర్ఎస్ పార్టీ నేతలపై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విమర్శలతో విరుచుకుపడ్డారు. తాను నోరు విప్పితే బీఆర్ఎస్ వాళ్లు ఇబ్బందిపడతారని ఆయన చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజల ఇళ్లను కదల్చకుండా మూసీ నది ప్రక్షాళన చేస్తే తాను స్వాగతిస్తానని అసద్ వెల్లడించారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read :Somy Ali : సల్మాన్‌కు అండర్ వరల్డ్ బెదిరింపు కాల్స్.. సోమీ అలీ సంచలన వ్యాఖ్యలు
మూసీ నది ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ హయాంలోనూ కసరత్తు జరిగిందని అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin) అన్నారు. ఆనాడు రూపొందించిన విధానాలను బీఆర్ఎస్ పార్టీ నేతలే ఈనాడు మార్చుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. ఈవిధంగా బీఆర్ఎస్ పార్టీ విధానాలను మార్చుకోవడం సరికాదన్నారు. ఇలాంటి వైఖరిపై ఆ పార్టీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని అసద్ సూచించారు.
Also Read :SkyWalk : హైదరాబాద్ లో మరో స్కైవాక్..ఎక్కడంటే..!!
బీఆర్ఎస్ పార్టీకి గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు రావడం అనేది తమ చలవేనని అసద్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 24 మంది అభ్యర్థులను బీఆర్ఎస్ మార్చి ఉంటే.. మళ్లీ గెలిచి ఉండేదన్నారు. అప్పట్లో బీఆర్ఎస్ నేతలకు అహంకారం ఉండేదని, అందువల్లే అభ్యర్థులను మార్చేందుకు ఇష్టపడలేదని ఆయన చెప్పారు. ‘‘తమతమ రాష్ట్రాల ప్రజలకు ఎక్కువ మంది సంతానం ఉండాలని సీఎంలు చంద్రబాబు, స్టాలిన్ చెబుతుంటే అందరూ వింటూ కూర్చున్నారు. అవే మాటలు నేను మాట్లాడి ఉంటే రాద్ధాంతం చేసి ఉండేవారు’’ అని ఒవైసీ పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో జననాల రేటు తక్కువగా ఉందని చంద్రబాబు చాలా ఆలస్యంగా గుర్తించారని తెలిపారు. జనాభా ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి నష్టం జరగడం ఖాయమన్నారు. దీనివల్ల ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల సంఖ్య తగ్గిపోతుందన్నారు. జనాభాను నియంత్రణలో ఉంచిన రాష్ట్రాలను ప్రోత్సహించేలా విధాన నిర్ణయాలు ఉండాలని అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.