Site icon HashtagU Telugu

Munneru Floods Threat: మున్నేరుకు మరోసారి వరద గండం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Munneru River Flood Threat Khammam

Munneru Floods Threat: ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగుకు వరద ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం ఖమ్మం వద్ద మున్నేరు వాగు వరద ప్రవాహం 16 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వాగు వరద ప్రవాహం 24 అడుగులకు చేరిన వెంటనే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో మున్నేరుకు వరద పోటు పెరిగింది. బయ్యారం, గార్ల చెరువులలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో మున్నేరు, ఆకేరు వాగులకు భారీగా వరద పెరిగే అవకాశం ఉంది.  ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. ఈనేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మున్నేరు వాగు వెంట నివసించే దన్వాయిగూడెం, రమణపేట్, ప్రకాశ్ నగర్,  మోతీనగర్, వెంకటేశ్వర నగర్ నుంచి ప్రజలను ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లోకి తరలిస్తున్నారు. గత వారం భారీ వర్షం, వరదలతో మున్నేరు పరివాహక ప్రాంతం మునిగిపోయింది. ఇప్పుడు మరోసారి మున్నేరు వాగుకు(Munneru Floods Threat) వరద గండం పొంచి ఉండటంతో అక్కడి ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు.

Also Read :Bronze Medalist Deepthi Jeevanji : దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి నగదు బహుమతి

ఖమ్మం జిల్లాకు భట్టి, పొంగులేటి, కిషన్ రెడ్డి..

  • మున్నేరు వాగుకు వరద ముప్పు పొంచి ఉండటంతో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి హుటాహుటిన ఖమ్మంకు బయలుదేరి వెళ్లారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని వారు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
  • ఇవాళ ఖమ్మం పట్టణంలోని 16వ డివిజన్ దంసాలపురంలో ఉన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో  కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి పర్యటిస్తారు. అక్కడి నుంచి నేరుగా పాలేరు నియోజకవర్గం తిరుమలాయ పాలెం, రాకాసి తాండాకు ఆయన వెళ్తారు. వరద బాధితులను పరామర్శించి, వారికి నిత్యావసరాలను అందజేస్తారు. లోతట్టు ప్రాంతాల్లో జరుగుతున్న సహాయక చర్యలను కిషన్ రెడ్డి పరిశీలిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపట్టిన పునరావాస కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు.