ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియాస్పత్రిలో ప్రసవించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ స్వయాన ఆసుపత్రికి చేరుకుని వారిని కలిసి పరామర్శించి, అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తూ, అన్ని రకాల సౌకర్యాలను కల్పించారని అన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలెక్టర్ భవేష్ మిశ్రా భార్య, ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియాస్పత్రిలో ప్రసవించి జిల్లా ప్రజలకు కలెక్టర్ దంపతులు ఆదర్శంగా నిలిచారని, ప్రజల్లో మరింత విశ్వాసం నింపారని మంత్రి అన్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ సక్రమంగా చేయరనేది కేవలం అపోహ మాత్రమే అని, ముఖ్యమంత్రి కేసీఆర్ కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దారని.. అందుకు ఉదాహరణ అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించడం అని స్పష్టం చేశారు.
ఒక కలెక్టర్ స్థాయిలో ఉండి, భార్య అడిషనల్ కలెక్టర్ స్థాయిలో ఉన్నప్పటికి ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనివ్వటం వారు తీసుకున్న నిర్ణయం ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన ఆదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠిని అభినందించి, కెసిఆర్ కిట్‌ను అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు 24 గంటలు వైద్య నిపుణులను అందుబాటులో ఉంచారని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఆసుపత్రి ఇంచార్జ్ డాక్టర్‌తో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న మంత్రి.. ఇలా త్రిపాఠి పండంటి మగ శిశువుకు జన్మనిచ్చిందని, శిశువు 3. 400కిలోల బరువు ఉన్నారని తెలిపారు. తల్లి బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న గర్భణీలతో మాట్లాడిన మంత్రి సత్యవతి రాథోడ్.. వారిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి ధైర్యంగా వచ్చి నార్మల్ డెలివరీ చేయించుకోవచ్చని తెలిపారు.