KCR Nomination : అది ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం ఇచ్చోడ మండలంలోని ‘ముఖరా కే’ గ్రామం. ఆ ఊరిలోని ఆసరా పింఛనుదారులంతా ప్రతినెలా రూ.1000 పొదుపు చేసుకునేవారు. ఆ డబ్బు నుంచి చెరో 50వేల రూపాయలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నామినేషన్ ఖర్చుల కోసం అందించారు. ‘ముఖరా కే’ గ్రామ సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీ సంతోష్ కుమార్ సహకారంతో ప్రగతి భవన్ కు చేరుకొని సీఎం కేసీఆర్ ను కలిసి ఆసరా పింఛనుదారులు ఇచ్చిన చెరో రూ.50వేల చెక్కులను కేసీఆర్ కు అందజేశారు. ముఖరా కే గ్రామ ఆసరా పింఛనుదార్ల ప్రేమాభిమానాలకు ముగ్ధుడైన సీఎం కేసీఆర్.. వారు పంపిన చందాను ఆప్యాయంగా అందుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈసందర్భంగా ముఖరా కే గ్రామస్తులకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపుతానని ‘ముఖరా కే’ గ్రామ సర్పంచ్ గాడ్గె మీనాక్షికి తెలిపారు. ‘‘ఎక్కడ ఆకలి ఉండదో.. ఎక్కడ కష్టాలు, కన్నీళ్లు ఉండవో.. అక్కడ ప్రజలంతా సుఖ సంతోషాలతో, ప్రేమాభిమానాలతో పరస్పర సహకార జీవన విధానంతో జీవిస్తారనే దానికి ముఖరా కే గ్రామమే నిదర్శనం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘నేను వీలు చూసుకొని తప్పకుండా ముఖరాకే గ్రామానికి వస్తాను. రోజంతా మీ గ్రామంలోనే గడుపుతాను’’ అని ఆ గ్రామ సర్పంచ్ కు మాటిచ్చారు. నవంబరు 9న కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిలలో నామినేషన్ వేయనున్నారు. అనంతరం కామారెడ్డి బహిరంగ సభలో (KCR Nomination) పాల్గొంటారు.