Exclusive Inside Story : ‘ముచ్చింతల్’ కోట ర‌హ‌స్యం!

ముచ్చింత‌ల్ శ్రీరామ‌న‌గ‌రంలోని సమ‌తామూర్తి రామానుజాచార్యుల విగ్రహం ఆవిష్క‌ర‌ణ తెలంగాణ సీఎం కేసీఆర్‌, త్రిదండి చిన‌జియ్య‌ర్ స్వామి మధ్య అగాధాన్ని పెంచింది.

  • Written By:
  • Updated On - March 16, 2022 / 05:08 PM IST

ముచ్చింత‌ల్ శ్రీరామ‌న‌గ‌రంలోని సమ‌తామూర్తి రామానుజాచార్యుల విగ్రహం ఆవిష్క‌ర‌ణ తెలంగాణ సీఎం కేసీఆర్‌, త్రిదండి చిన‌జియ్య‌ర్ స్వామి మధ్య అగాధాన్ని పెంచింది.ముచ్చింత‌ల్ శ్రీరామ‌న‌గ‌రంలోని సమ‌తామూర్తి రామానుజాచార్యుల విగ్రహం ఆవిష్క‌ర‌ణ తెలంగాణ సీఎం కేసీఆర్‌, త్రిదండి చిన‌జియ్య‌ర్ స్వామి మధ్య అగాధాన్ని పెంచింది. ఆ విష‌యం ఫిబ్రవరి 5వ తేదీ విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ రోజు నుంచి ప్ర‌చారంలో ఉంది. కానీ, ఎందుకు వాళ్లిద్ద‌రి మ‌ధ్యా గ్యాప్ వ‌చ్చింద‌నే దానిపై అస్ప‌ష్ట‌త ఉంది. దానిలోని వాస్త‌వాల‌పై అధ్య‌య‌నం చేయ‌గా ప‌లు ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు త్రిదండి చిన జీయ‌ర్ స్వామికి ఉన్న భ‌క్తుల్లో ప్ర‌ముఖుడు. ఆయ‌న స‌మ‌కూర్చిన‌ భూమిలో త్రిదండి చిన జియ‌ర్ స్వామి హైద‌రాబాద్ ముచ్చింత‌ల్ వ‌ద్ద‌ శ్రీరామ‌న‌గ‌ర్ లో ఆధ్మాత్మిక కేంద్రాన్ని సృష్టించాడు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ (స‌మానత‌) చిహ్నంగా 216 అడుగుల రామానుజాచార్యుల స‌మ‌తామూర్తి విగ్ర‌హం అక్క‌డ‌ హైలెట్ గా ఉంది. ప్ర‌పంచంలోనే రెండో అతి పెద్ద విగ్ర‌హంగా పేరుగాంచింది. దాని కింద గ‌ర్భ‌గుడిలో 120 కిలోల బంగారు విగ్ర‌హం నిత్య‌పూజ‌ల కోసం రూపొందించారు. ఆ గుడి ద్వారాల‌న్నీ బంగారు రేకుల తొడుగుల‌తో ఉండ‌డం విశేషం. ఇక‌ స‌మ‌తామూర్తి విగ్ర‌హం చుట్టూ నిర్మించిన 108 ఆలయాలను అనుసంధానిస్తూ అష్టదళ పద్మాకృతిలో 45 అడుగుల ఎత్తున డైన‌మిక్ ఫౌంటెయిన్ అక్క‌డి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. ఈ మూడు ముచ్చింత‌ల్ శ్రీరామ‌న‌గ‌ర్ ఆధ్మాత్మిక కేంద్రంలోని హైలెట్ నిర్మాణాలు.

ఆధ్మాత్మిక కేంద్ర ప్రారంభాన్ని పెద్ద ఎత్తున ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 2 నుంచి 14వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించాల‌ని చిన్నజియ్య‌ర్ ముహూర్తం పెట్టుకున్నాడు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేతుల మీదుగా స‌మ‌తా మూర్తి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించాల‌ని భావించాడు. ఆ మేర‌కు ఢిల్లీ వెళ్లి వ్య‌క్తిగ‌తంగా జీయ‌ర్, జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు ప్ర‌ధాని మోడీని క‌లిసి ఆహ్వానించారు. అలాగే, రాష్ట్ర‌ప‌తి కోవింద్ చేతులు మీదుగా గ‌ర్భ‌గుడిలోని 120 కిలోల రామానుజాచార్యుల బంగారు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించడానికి కోవింద్ కు ఆహ్వాన ప‌త్రిక‌ను అందించారు. డైన‌మిక్ ఫౌంటైన్ ను కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాల‌ని తొలుత అనుకోలేదు. చివ‌రి నిమిషంలో అనివార్యంగా ఆయ‌నతో ఓపెన్ చేయించాల‌ని అనుకోవ‌డ‌మే సీఎం కేసీఆర్‌, చిన జియ‌ర్ మ‌ధ్య అగాధానికి ప్రధాన కార‌ణం.స‌మ‌తామూర్తి విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ కోసం త‌యారు చేసిన శిలాఫ‌కంలో ప్ర‌ధాని మోడీ, సీఎం కేసీఆర్ పేర్లు పెట్టాల‌ని చిన జియర్ అనుకున్నాడు. కానీ, ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం సీఎం కేసీఆర్ పేరు శిలాఫ‌ల‌కంపై ఉండ‌డానికి వీల్లేద‌ని ప్రొటోకాల్ నిబంధ‌న‌లు పెట్టారు. దీంతో వ‌సంత పంచ‌మి( ఫిబ్ర‌వ‌రి 5) రోజున‌ ఆవిష్క‌ర‌ణకు కొన్ని గంట‌ల ముందు కేసీఆర్ పేరు లేకుండా శిలాఫ‌ల‌కం సిద్ధం అయింది. ఆ విష‌యాన్ని సీఎం కేసీఆర్ అనుచ‌రులు ఆయ‌న‌కు చేర‌వేశారు. దీంతో విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు వ‌చ్చిన ప్ర‌ధాని మోడీ కార్య‌క్ర‌మానికి సీఎం కేసీఆర్ అస్వ‌స్థ‌త పేరుతో దూరంగా ఉన్నాడని తెలుస్తోంది.
గ‌ర్భ‌గుడిలోని 120 కిలోల బంగారు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌డానికి రాష్ట్ర‌ప‌తి కోవింద్ ఫిబ్ర‌వ‌రి 13వ తేదీ ముచ్చింత‌ల్ శ్రీరామ‌న‌గ‌ర్ ఆధ్యాత్మిక కేంద్రానికి వ‌చ్చాడు. ఆ సంద‌ర్భంగా ఆయ‌నకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కేసీఆర్ స్వాగ‌తం ప‌లికాడు. కానీ, బంగారు విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ‌కు దూరంగా ఉన్నాడు. ఆ విగ్ర‌హావిష్క‌ర‌ణ శిలాఫ‌ల‌కంపై తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు కూడా ఉంది. ప్రొటోకాల్ ప్ర‌కారం కేసీఆర్ పేరు తొల‌గించాల‌ని రాష్ట్ర‌ప‌తిభ‌వ‌న్ తెలియ‌చేసింది. కానీ, చిన జియ‌ర్ శిలాఫ‌ల‌కంలో కేసీఆర్ పేరును కొన‌సాగించాడు. ఆ విష‌యంపై రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు ఇప్ప‌టికీ గుర్రుగా ఉన్నాయ‌ని టాక్‌.

 

ఆ ఆధ్యాత్మిక కేంద్రంలోని మూడో ప్ర‌ధాన‌మైన డైన‌మిక్ ఫౌంటైన్ ను కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాల‌ని జియ‌ర్ నిర్ణ‌యించుకున్నాడు. ఆ మేర‌కు శిలాఫ‌ల‌కంపై కేసీఆర్ పేరు లిఖించారు. షెడ్యూల్ ప్ర‌కారం ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన దాన్ని ప్రారంభించాలి. అదే రోజు ముగింపు శాంతి క‌ల్యాణం కూడా జ‌ర‌పాలి. స‌మ‌తామూర్తి, బంగారు విగ్ర‌హాల‌ ఆవిష్క‌ర‌ణ స‌మ‌యంలో జ‌రిగిన అవ‌మానం కేసీఆర్ ను బాధించింద‌ట‌. అందుకే, డైన‌మిక్ ఫౌంటైన్ ప్రారంభానికి నిరాక‌రించాడ‌ని ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ర్గాల వినికిడి. ఆయ‌న కోసం 14వ తేదీన జ‌ర‌గాల్సిన శాంతిక‌ల్యాణం కూడా వాయిదా ప‌డింది. ఆ రోజు నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ తో ప‌లు మార్గాల ద్వారా జియ‌ర్ ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ సానుకూల స్పంద‌న రాలేద‌ట‌. అందుకే, ఈనెల 19 తేదీన శాంతి క‌ల్యాణాన్ని ముగించారు. దానికి కేసీఆర్‌ను ఆహ్వానించామ‌ని జియ‌ర్ ముందు రోజు ప్ర‌క‌టించాడు. కానీ, కేసీఆర్ గైర్హాజ‌రు అయ్యాడు.

చిన జియ‌ర్, కేసీఆర్ మ‌ధ్య ఏర్ప‌డిన విభేదాలు కార‌ణంగా ఫిబ్ర‌వ‌రి 14న పెండింగ్ లో ప‌డిన డైన‌మిక్‌ ఫౌంటైన్ ప్రారంభాన్ని సాదాసీదాగా జీయ‌ర్ కానిచ్చేశాడు. ప్రారంభోత్స‌వ శిలాఫ‌ల‌కంపై కేసీఆర్ య‌ధాత‌దంగా కొన‌సాగిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం డైన‌మిక్‌ ఫౌంటైన్‌, త్రీ ఢీ అందాలు భ‌క్తుల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. ఇంత జ‌రిగిన‌ప్ప‌టికీ జీయ‌ర్ మాత్రం ఎలాంటి విభేదాలు సీఎం కేసీఆర్ తో లేవ‌ని మీడియా ద్వారా వెల్ల‌డించాడు. అంతేకాదు, 2016లోనే ప్ర‌ధాన మంత్రి ఆహ్వానం ఖ‌రారు అయింద‌ని చెబుతున్నాడు. ఆహ్వానం ప‌లికిన రోజు ఆవిష్క‌ర‌ణ‌కు సంబంధించిన వివరాలు పీఎంవో ఆఫీస్ కు ఇచ్చామ‌ని, ఆ రోజు ఇచ్చిన పేర్లు మాత్ర‌మే శిలాఫ‌ల‌కంపై ఉంటాయ‌ని జియ‌ర్ వివ‌రించాడు. ఇదిలా ఉంటే, యాదాద్రి దేవాల‌యాన్ని సుమారు 1000 కోట్ల‌తో పున‌ర్నిర్మాణ జియ‌ర్ సూచ‌న‌ల మేర‌కు జ‌రిగిన విష‌యం విదిత‌మే. ఈనెల 28వ తేదీన స్వ‌యంభూ యాదాద్రి లక్ష్మీన‌ర‌సింహుని ద‌ర్శ‌నం ప్రారంభించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం షెడ్యూల్ ను ప్ర‌క‌టించింది. ఆ మేర‌కు ప్ర‌ముఖుల‌కు ఆహ్వానాల‌ను పంపుతోంది. కానీ, చిన జియ‌ర్ కు మాత్రం తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి ఆహ్వానం పంపలేద‌ని విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. ఆహ్వానం పంపే ఆలోచ‌న కూడా సీఎం కేసీఆర్ కు లేద‌ని ఆయ‌న స‌హ‌చ‌రుల్లో జ‌రుగుతోన్న చ‌ర్చ‌. ఈ ప‌రిణామాల‌న్నీ గ‌మ‌నిస్తే, చిన జియర్ , తెలంగాణ‌ సీఎం కేసీఆర్ కు మ‌ధ్య నిశ్శబ్ధ యుద్ధం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం అవుతోంది.