PhD Research in 170 Colleges : ఇంజినీరింగ్ లో ఎంఫిల్, పీహెచ్‌డీ రీసెర్చ్ చేయాలి అనుకునేవారికి గుడ్ న్యూస్. ఇకపై జేఎన్‌టీయూ అనుబంధ ఇంజినీరింగ్ కాలేజీల్లోనూ స్టూడెంట్స్ రీసెర్చ్ చేయొచ్చు. రాష్ట్రంలోని 170 ఇంజినీరింగ్ కాలేజీల్లో ఎంఫిల్, పీహెచ్‌డీ రీసెర్చ్ కు ఛాన్స్ కల్పిస్తూ జేఎన్‌టీయూ హైదరాబాద్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం జేఎన్‌టీయూ అనుబంధ ఇంజినీరింగ్ కాలేజీల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు, పరిశోధనలను నిర్వహించేందుకుగాను ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. రీసెర్చ్ సెంటర్స్ ను ఏర్పాటు చేయాలనుకునే ఇంజినీరింగ్ కాలేజీలు జులై 28లోపు దరఖాస్తులను సమర్పించాలని ఉత్తర్వుల్లో(PhD Research in 170 Colleges) పేర్కొన్నారు. ఈ రీసెర్చ్ సెంటర్స్ కు యూజీసీ నుంచి స్వయం ప్రతిపత్తి హోదా లేదా న్యాక్, ఎన్‌బీఏ గ్రేడ్ తప్పనిసరిగా ఉండాలన్నారు. రీసెర్చ్ కోసం రూ.25 లక్షలతో కార్పస్ నిధి ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కేంద్రాలను విశ్వవిద్యాలయ సలహా కమిటీ పర్యవేక్షిస్తుందని అధికారులు తెలిపారు. పీహెచ్‌డీ అడ్మిషన్స్ కోసం తమ అనుబంధ కళాశాలలు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇవ్వొచ్చని పేర్కొన్నారు . జేఎన్‌టీయూ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ అనుమతి పొందాకే ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.
Also read : 4 Terrorists Killed: జమ్మూకశ్మీర్‌లో కాల్పుల కలకలం.. కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు, నలుగురు ఉగ్రవాదులు హతం
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పీహెచ్‌డీ అక్కర్లేదు
ఉన్నత విద్యా సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పీహెచ్‌డీ తప్పనిసరి నిబంధనను తొలగించినట్టు వెల్లడించింది. ఇకపై ఈ పోస్టులకు పీహెచ్‌డీ అవసరం లేదని స్పష్టంచేసింది. ఆయా అభ్యర్థులు నెట్/సెట్/స్లెట్ పరీక్షల్లో అర్హత సాధిస్తే చాలని పేర్కొంది. ఈ నిర్ణయం జులై 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలిపింది.