Site icon HashtagU Telugu

Theatre Fined: సినిమా చూడ్డానికి వచ్చి థియేటర్ కి లక్ష రూపాయల ఫైన్ వేయించాడు

5efd9b977152d8036c470a49 Imresizer

5efd9b977152d8036c470a49 Imresizer

సమయానికి కాకుండా లేట్ గా సినిమా వేసిన సినిమా థియేటర్ కు వినియోగాదారుల ఫోరం భారీగా ఫైన్ వేసింది. సినిమా టికెట్ పై ముద్రించిన సమయానికి సినిమాను ప్రారంభించకుండా 15 నిమిషాలు ప్రకటనలు వేసి, తన సమయాన్ని వృథా చేశారని విజయ్ గోపాల్ అనే వ్యక్తి వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు. త‌న‌ సమయాన్ని వృథా చేసిన ఐనాక్స్‌ లీజర్‌ ప్రైవేట్ లిమిటెడ్‌పై చ‌ర్య‌లు తీసుకుని త‌న‌కు న్యాయం చేయాలని కోరారు.

ఈ ఇన్సిడెంట్ రెండు సంవత్సరాల క్రితం జరిగిందట. హైదరాబాద్ కి చెందిన విజయ్ గోపాల్ 2019 జూన్‌ 22న గేమ్‌ ఓవర్‌ అనే సినిమా చూసేందుకు కాచిగూడ‌ లోని ఐనాక్స్‌ థియేటర్‌కు వెళ్లారు. టికెట్‌పై ముద్రించిన సమయం ప్రకారం సినిమా సాయంత్రం 4.30 గంట‌ల‌కు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, సాయంత్రం 4.45 గంట‌ల‌కు ప్రారంభ‌మైందట. 15 నిమిషాలు యాడ్స్ వేసి తన సమయం వృథా చేశారని గోపాల్ సీరియస్ అయ్యారు. దీనిపై థియేటర్‌ మేనేజర్‌కు కూడా ఫిర్యాదు చేస్తే ఎలాంటి రెస్పాన్స్ రాలేదట. దీనితో ఆయన హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమీషన్ కు కంప్లయింట్ చేశారు. ఈ కేసులో రెండో ప్రతివాదిగా లైసెన్సింగ్‌ అథారిటీ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్ ను చేర్చారు.

తెలంగాణ సినిమాస్‌ రెగ్యులేషన్‌ చట్టం-1955లో పేర్కొన్నట్లు పాత విధానం ప్ర‌కార‌మే ప్రకటనలు వేస్తున్నట్లు థియేటర్‌ యాజమాన్యం సమర్థించుకునే ప్ర‌య‌త్నం ‌చేసింది. త‌మ‌కు ఆర్టికల్‌ 19(1)(జీ), (ఏ) ప్రకారం ప్రకటనలు వేసే హక్కు ఉందని తెలిపింది. అయితే, ఐనాక్స్‌ సంస్థ వాద‌న‌ల‌ను వినియోగదారుల ఫోరం తప్పుపట్టింది.

చట్టం ప్రకారం కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉచిత ప్రకటనలు వేసే హక్కు ఉందని తెలిపింది. అంతేగాక‌, వాణిజ్య ప్రకటనలు వేయడం నిబంధనలకు విరుద్ధమని తీర్పునిచ్చింది. ఫిర్యాదుదారుడికి పరిహారంగా ఐదువేల రూపాయలు, కేసు ఖర్చుల కింద మరో ఐదువేల రూపాయలను చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఇక పెనాల్టీ కింద థియేటర్ కు రూ.లక్ష జరిమానా విధించింది. ఆ డబ్బుని లైసెన్సింగ్‌ అథారిటీ అయిన హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కి ఇవ్వాలంది. థియేటర్లలో భద్రతకు, విపత్తు నిధిగా ఆ డబ్బుని వినియోగించాలని సూచించింది.