Movie Theaters: తెలంగాణ రాష్ట్రంలోని సినీ ప్రియులకు షాక్ తగలనుంది. రాష్ట్రంలోని సినిమా థియేటర్ల (Movie Theaters)ను ఈనెల 17 నుంచి బంద్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి గల కారణాలను కూడా తెలంగాణ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ పేర్కొంది. ఈ నెల 17 నుంచి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్ మూసివేయనున్నట్లు అసోసియేషన్ తెలిపింది. తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు, ఇతర కారణాలతో ఇటీవల పెద్ద సినిమాలు విడుదల కాకపోవడంతో సినిమా హాళ్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీంతో రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో శుక్రవారం నుంచి పది రోజుల పాటు షోలు వేయవద్దని థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయించింది.
ఈ పది రోజుల గ్యాప్‌లో పెద్ద హీరోల సినిమాలు, చెప్పుకోదగిన సినిమాలు ఏవీ విడుదలకు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా మొన్నటిదాకా ఏపీ, తెలంగాణలో ఎన్నికల వాతావరణం ఉండటంతో థియేటర్ వైపు చూసే జనమే లేకుండా పోయారు. దీంతో థియేటర్ ఓనర్లు తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలుస్తోంది. షోలు ఉన్న లేకున్నా థియేటర్ నిర్వహణ ఖర్చు, కరెంట్ బిల్లు, ఇతర ఖర్చులు థియేటర్ ఓనర్లకు భారంగా మారాయి.
Also Read: Jr NTR : ఆ గుడి కోసం ఎన్టీఆర్ అన్ని లక్షల విరాళం ఇచ్చారా..!
ప్రతి ఏడాది సమ్మర్‌లో పెద్ద హీరోలు తమ సినిమాలు విడుదల అయ్యేలా ప్లాన్ చేసుకుంటారు. కానీ ఈ వేసవి మాత్రం చాలా భిన్నంగా ఉంది. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి చెప్పుకోదగ సినిమాలు విడుదల కాకపోవడం గమనార్హం. టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు కూడా ఏపీలో ఎన్నికలు ఉండటంతో తమ పార్టీలకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అయితే థియేటర్ల బంద్ వలన చిన్న సినిమాలకు ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే బడా హీరోలు లేని సమయంలోనే చిన్న హీరోలు తమ సత్తా చూపటానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు 10 రోజులు థియేటర్లు బంద్ ప్రకటించడంతో చిన్న సినిమాల నిర్మాతలు నష్టపోయే అవకాశం ఉంది. అసలు థియేటర్లకు ప్రేక్షకులు రావట్లేదని తెలంగాణ థియేటర్ ఓనర్స్ చెబుతుంది. అయితే నెలకు ఒక్క సినిమా అయిన పెద్ద హీరోలది వస్తే థియేటర్ల పరిస్థితి బాగుంటుందని అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. థియేటర్ల మీదే ఆధారపడి జీవిస్తున్న వారి పరిస్థితి కూడా ఇలాంటి సమయంలో ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp : Click to Join