Temple Idol Row : సికింద్రాబాద్ ‘మ‌హంకాళి’కి అమంగ‌ళం

సికింద్రాబాద్ ఉజ్జ‌యిన మ‌హంకాళి ఆల‌యంలోని విగ్రహం వివాదం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

  • Written By:
  • Publish Date - May 25, 2022 / 04:22 PM IST

సికింద్రాబాద్ ఉజ్జ‌యిన మ‌హంకాళి ఆల‌యంలోని విగ్రహం వివాదం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ప్రస్తుతం ఉన్న విగ్ర‌హం స్థానంలో మ‌రింత పెద్ద విగ్ర‌హాన్ని పెట్టాల‌ని ఆల‌య నిర్వాహ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆ మేర‌కు రెండు నెల‌లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద బోనాల వేడుకలకు నిలయమైన సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రస్తుతం ఉన్న విగ్రహం చాలా చిన్నది. భక్తులకు సులువుగా విగ్ర‌హం క‌నిపించ‌డంలేదని నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే అమ్మవారి పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని యోచిస్తున్నారు. ఆ విష‌యాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్ మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి రంగంలోకి దిగారు. మే 2వ తేదీన ఆల‌య ఈవోను క‌ల‌వ‌డంతో పాటు దేవాదాయ‌శాఖ క‌మిష‌న‌ర్ ను క‌లుసుకున్నారు. ప్ర‌స్తుతం ఉన్న విగ్ర‌హాన్ని మార్చ‌డానికి లేద‌ని తెలియ‌చేశారు.

ఆల‌య నిర్వాహ‌కులు మాత్రం మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి విజ్ఞ‌ప్తిని ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా అమ్మ‌వారి విగ్ర‌హాన్ని మార్చ‌డానికి ముందుకు క‌దిలారు. దీంతో ఈనెల 24వ తేదీన దేవాదాయ‌శాఖ మంత్రి ఇంద్ర‌క‌రణ్ రెడ్డిని క‌లుసుకున్నారు. ఆల‌యంలోని అమ్మ‌వారి విగ్ర‌హాన్ని మార్పు చేయ‌కుండా ఆదేశాలు ఇవ్వాల‌ని కోరారు. దీంతో ఆల‌య నిర్వాహ‌కులు, ఈవో, క‌మిష‌న‌ర్ ను మంత్రి అలెర్ట్ చేశారు. అమ్మ‌వారి విగ్ర‌హాన్ని మార్చ‌డానికి లేద‌ని మంత్రి ఆదేశించారు. కానీ, అమ్మ‌వారి విగ్ర‌హం మార్పును గోప్యంగా చేయాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి అనుమానిస్తున్నారు.

ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని 1815లో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో బ్రిటిష్ సైన్యంలో పనిచేసిన సురితి అప్పయ్య స్థాపించారు. ఉజ్జయినిలో అప్పట్లో విధ్వంసం సృష్టించిన ప్లేగు వ్యాధి తగ్గితే తన స్వగ్రామమైన హైదరాబాద్‌లో మహంకాళికి ఆలయాన్ని నిర్మిస్తానని శపథం చేశాడు. ఉజ్జయిని నుండి అప్పయ్య తొమ్మిది అంగుళాల ఎత్తైన రాతి విగ్రహాన్ని నగరానికి తీసుకువచ్చాడు. అప్ప‌టి నుంచి ఉజ్జయిని మహంకాళి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. విగ్రహం చిన్నది కావడంతో దాని స్థానంలో కొత్తగా 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉన్న దేవతా విగ్రహాన్ని ప్ర‌తిష్టించాల‌ని నిర్వాహ‌కులు సిద్ధం అయ్యారు. ప్ర‌స్తుతం ఉన్న విగ్ర‌హానికి ముందుగా పెద్ద విగ్ర‌హాన్ని పెడుతూ ఆ రెండింటినీ బంగారు తీగతో అనుసంధానించాల‌ని ప్లాన్ చేశారు.

తరతరాలుగా పూజలు చేస్తున్న లక్షలాది మంది భక్తుల విశ్వాసం ఇందులో ఉంది. ఈ దేవాలయం శక్తి ఈ దేవత నుండి ఉద్భవించిందని ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు నిర్వాహకులు ప్రధాన దేవత ముందు పెద్ద విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారు. ఈ ప్రతిపాదనను స్థాపక కుటుంబం, ధర్మకర్తలు, పుష్పగిరి పీఠం స్వామీజీ, ఆలయ అర్చకులు అంగీకరించినట్లు ఆలయ నిర్వాహకులు ఎండోమెంట్స్ కమిషనర్‌కు లేఖ రాశారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సూచనల మేరకే కొత్త విగ్రహ ప్రతిష్ఠాపనకు శ్రీకారం చుట్టినట్లు లేఖలో శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు.

“జూలైలో జరిగే బోనాల జాతరలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి సిద్ధం అయ్యారు. ఆలయ కార్యనిర్వహణాధికారి గుత్తా మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకున్నాకే ముందుకు వెళ్తున్నామన్నారు. పెద్ద విగ్రహం భక్తుల ప్రయోజనం కోసం పెడుతున్నామ‌ని చెబుతున్నారు. దీని వెనుక మ‌త‌ల‌బు ఉంద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి విశ్వ‌సిస్తున్నారు. శ‌క్తివంతమైన దేవ‌తా విగ్ర‌హం ముందు మ‌రో విగ్ర‌హాన్ని పెట్ట‌డం ఏమిట‌ని మ‌ర్రి నిల‌దీస్తున్నారు.