Mother Dies While Breastfeeding: బిడ్డకు పాలిస్తూ చనిపోయిన తల్లి.. నేరళ్లపల్లిలో హృదయవిదారక ఘటన

అమ్మంటే ప్రేమకు రూపం. తన ప్రాణాలను పణంగా పెట్టయినా సరే.. బిడ్డను కాపాడుకుంటుంది.

Published By: HashtagU Telugu Desk
Lady

Lady

అమ్మంటే ప్రేమకు రూపం. తన ప్రాణాలను పణంగా పెట్టయినా సరే.. బిడ్డను కాపాడుకుంటుంది. తెలంగాణలోని ఓ మాతృమూర్తిని చూస్తే అది అర్థమవుతుంది. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం, నేరళ్లపల్లిలో జరిగిన ఘటన.. అందరి హృదయాలనూ కలచివేస్తోంది. నెలల చిన్నారి ఆకలితో గుక్కపట్టి ఏడుస్తుండడంతో తల్లడిల్లిన ఆ తల్లి మనసు బిడ్డకు పాలిచ్చింది. కానీ ఆ క్షణానే ఆ తల్లి ఊపిరి ఆగిపోయింది.

జయశ్రీ. పేరుకు తగ్గట్టు ఇన్నాళ్లూ దిగ్విజయంగానే తన జీవితాన్ని నడుపుతూ వచ్చిన ఆ తల్లి.. మృత్యువు ముందు మాత్రం జయం సాధించలేకపోయింది. తొలికాన్పు కోసం పుట్టింటికి వచ్చిన ఆమె.. రెండు నెలల కిందటే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తరువాత ఆమె కొద్దిపాటి అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె భర్త ప్రశాంత్.. మహబూబ్ నగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు.

జయశ్రీ అనారోగ్య వివరాలను తెలుసుకున్న వైద్యులు ఆమెకు వైద్యపరీక్షలు చేశారు. ఆమె గుండె వాల్వులో చిన్న సమస్య ఉందని తేల్చారు. కాకపోతే మందులు వాడితే చాలని.. సమస్య పరిష్కారమవుతుందని ప్రశాంత్ కు చెప్పారు. దీంతో దంపతులిద్దరి మనసు కుదుటపడింది. అందుకే డాక్టర్లు ఇచ్చిన భరోసాతో తిరిగి నేరళ్లపల్లికి వచ్చేశారు. కానీ ఒక్కరోజు గడిచిందో లేదో విధి వారి జీవితాలతో ఆడుకుంది.

ఆసుపత్రి నుంచి వచ్చిన మరుసటి రోజు ఉదయం.. అంటే 5.30 గంటల సమయంలో బిడ్డ ఆకలితో ఏడుస్తుండడంతో జయశ్రీ ఆ చిన్నారికి పాలిచ్చింది. కానీ అలా తన బిడ్డ ఆకలి తీరుస్తూనే.. తాను మాత్రం ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు కూడా వెంటనే గుర్తించలేకపోయారు. తాత, అమ్మమ్మ టీ కోసం పిలిచినా ఆమె రాలేదు. దీంతో అనుమానం వచ్చిన వాళ్లు జయశ్రీని పరిశీలించడంతో ఆమె చనిపోయిందని అర్థమైంది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

  Last Updated: 25 Jul 2022, 12:37 PM IST