Telangana: ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలతో గందరగోళం

తెలంగాణ లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల ఫలితాలును గురువారం రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఈ పరీక్షల్లో ఏకంగా 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వగా.. కేవలం 49 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు.

  • Written By:
  • Updated On - December 17, 2021 / 12:59 PM IST

తెలంగాణ లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల ఫలితాలును గురువారం రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఈ పరీక్షల్లో ఏకంగా 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వగా.. కేవలం 49 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు. పాస్ ఐనవారిలో కూడా చాలా మంది బార్డర్ మార్కులతో బయటపడగా.. ఒక్కరు కూడా 100 శాతం మార్కులు సాధించలేకపోవడం గమనార్హం.

వాస్తవానికి ఇప్పుడు ఇంటర్ ఫస్టియర్ ఫెయిల్ అయిన విద్యార్థులు పదో తరగతి చదువుతున్న సమయంలో కరోనా కారణంగా లాక్ డౌన్ విధించారు. దీంతో లాక్ డౌన్లోనే ఆన్ లైన్ క్లాసులు మొదలయ్యాయి. అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఆన్ లైన్ క్లాసు లపై అవగాహన లేకపోవడం. చాలా మంది పేద విద్యార్థుల వద్ద సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో వారి చదువుపై తీవ్ర ప్రభావాన్నిచూపింది.

ప్రస్తుతం ఈ విద్యార్థులంతా ఇప్పుడు ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. కరోనా కారణంగా వీరికి పరీక్షలు నిర్వహించకపోగా.. పరిస్థితి మెరుగుపడిన నేపథ్యంలో ఫస్ట్ ఇయర్ పరీక్షలను నిర్వహించారు. ఫస్టియర్ పరీక్షలు ఉండవనే ఆలోచనలో ఉన్న విద్యార్థులు ఫస్టియర్ ను పక్కన పెట్టేసి, సెకండియర్ పై ఫోకస్ పెట్టారు. ఇలాంటి సమయంలో పరీక్షలను నిర్వహించడంతో… విద్యార్థుల పరిస్థితి తారుమారైంది.

మరోవైపు వీరికి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీనికి సంబంధించి విద్యాశాఖ నుంచి కానీ, ఇంటర్ బోర్డు నుంచి కానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో, ఫెయిల్ అయిన విద్యార్థులందరూ… ఇంటర్ సెకండ్ ఇయర్ తో పాటు ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్ అయిన సబ్జెక్టులు కూడా రాయాల్సి ఉంది. దీంతో విద్యార్థులు.. వారి తల్లితండ్రులు తీవ్రమనస్థాపానికి గురవుతున్నారు.

ప్రతి విద్యార్థికి ఇంటర్ మార్కులు చాలా కీలకం. ఇంజినీరింగ్, మెడిసిన్ సీట్లను భర్తీ చేసే క్రమంలో ఇంటర్ మార్కులకు వెయిటేజి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ మార్కులు విద్యార్థుల భవిష్యత్తుపై నెగెటివ్ గా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడి పడిన ఈ పరీక్ష ఫలితాల పై పునరాలోచన చేయాలి.