Heavy Floods : మోరంచపల్లి లో నీరు పోయింది..కన్నీరు మిగిలింది

మోరంచపల్లి గ్రామాన్ని చూస్తుంటే ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకుంటున్నారు.

  • Written By:
  • Updated On - July 28, 2023 / 10:46 AM IST

భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి (Moranchapalli) గ్రామాన్ని చూస్తుంటే ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకుంటున్నారు. గ్రామంలో వరద నీరు పోయింది..కన్నీరు మిగిలిందని వాపోతున్నారు. మూడు రోజులుగా జిల్లాలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో మోరంచ వాగు (Morancha vaagu) ఉప్పొంగింది. దానికి గణప సముద్రం (Ganapa Samudram) వరద తోడటంతో మోరంచ ఉగ్రరూపం దాల్చింది. దీంతో మోరంచపల్లి గ్రామాన్ని వరద చుట్టుముట్టింది. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ప్రజలు అన్ని వదిలేసి కట్టుబట్టలతో ఊరు వదిలి వెళ్లారు. మరికొంతమంది మేడపైకి వెళ్లి తలదాచుకుంటే… ఇంకొందరు చెట్లు ఎక్కి ప్రాణాలను రక్షించుకున్నారు. ఇలా తెల్లవార్లు బిక్కుబిక్కుమంటూ భయంతో గడిపారు మోరంచపల్లి వాసులు. ఈ విషయం తెలిసి అధికారులు వెళ్లేంత వరకు అంటే దాదాపు 10 గంటల సమయం చెట్లపై, మిద్దెలు, మేడలపై నిల్చొని ఉన్నారు.

moranchapalli Current situation

సహాయం చేయడానికి వనరులున్నా భారీ వర్షం అడ్డంకిగా మారింది. వారిని రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్‌ బృందాలు పడవలను ఉపయోగించారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో అది వీలు పడలేదు. దీంతో హెలికాప్టర్ సాయంతో వారిని రక్షించారు. ప్రస్తుతం వరద తగ్గడం తో సొంత ఇళ్లకు చేరుకుంటూ..ఇళ్ల పరిస్థితి చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇళ్ల ముందు కట్టేసిన పాడి పశువులు మృతి చెందాయి. ఇళ్లలోకి వరద చేరడం తో ఇళ్లలోని సామాన్లన్నీ వరదలో కొట్టుకుపోయాయి. చాలాఇళ్లులు నేలమట్టం అయ్యాయి. ఊరంతా ఇసుకు మేటలు వేసింది. ఇళ్లంతా బురద మయమయ్యాయి. ఫర్నీచర్ పూర్తిగా తడిసి పాడై పోయాయి. తినడానికి తిండి లేదు , వాడుకోవడానికి వస్తువులు లేవు. ఇవన్నీ చూస్తూ వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు. నీరు పోయిన..కన్నీరు మిగిల్చిందంటూ వారంతా బోరుమంటున్నారు . తమని ప్రభుత్వమే ఆదుకోవాలని వాపోతున్నారు.

ఇక శుక్రవారం ఉదయానే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి (MLA Gandra Venkata Ramana reddy), జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి (Gandra Jyothi) మోరంచపల్లికి చేరుకున్నారు. దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. ఇంటింటికి తిరిగి పరిశీలిస్తూ, బాధితులను పరామర్శించారు. బాధితుల క్షేమసమాచారాలు అడిగితెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Read Also : Telangana Rains: ఎట్టి పరిస్థితుల్లో ప్రాణనష్టం జరగొద్దు, మంత్రులకు సీఎం ఆదేశాలు