Anti Modi Placards:`బైబై మోడీ` ప్ల కార్డుల‌తో రెడ్ డ్ర‌స్ యూత్‌

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి అడుగ‌డుగునా వ్య‌తిరేక హోర్డింగ్ లు, ప్లే కార్డుల ప్ర‌ద‌ర్శ‌న‌లు హైద‌రాబాద్ అంత‌టా కనిపిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - July 2, 2022 / 01:14 PM IST

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి అడుగ‌డుగునా వ్య‌తిరేక హోర్డింగ్ లు, ప్లే కార్డుల ప్ర‌ద‌ర్శ‌న‌లు హైద‌రాబాద్ అంత‌టా కనిపిస్తున్నాయి. పోలీసులు ఎంత నివారించిన‌ప్ప‌టికీ దేశాన్ని లూటీ చేస్తోన్న మోడీ బైబై అంటూ ప్లే కార్డులు ప‌ట్టుకుని యువ‌కులు నిర‌స‌న‌ ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నారు. న‌గ‌రంలోని ప‌లు కూడ‌ళ్ల‌లో కొంద‌రు యువ‌కులు ఎర్ర దుస్తులు ధ‌రించి ప్లే కార్డులు ప‌ట్టుకుని క‌నిపించ‌డం పొలిటిక‌ల్ హీట్ ను పెంచుతోంది.

బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల సంద‌ర్భంగా న‌గ‌ర‌మంత‌టా హోర్డింగ్ లు, స్వాగ‌త తోర‌ణాలు క‌మ‌ల‌నాథులు క‌ట్టారు. రోడ్ల‌కు ఇరువైపులా మోడీ , అమిత్ షా , రాజ‌నాథ్ సింగ్ హోర్డింగ్ లు క‌నిపిస్తున్నాయి. ఇదే సంద‌ర్భంలో పోటీగా హైద‌రాబాద్ మెట్రో పిల్ల‌ర్స్ కు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు క‌నిపిస్తున్నాయి. ఎనిమిదేళ్ల‌లో సీఎంగా సాధించిన విజ‌యాల‌ను తెలియ‌చేస్తూ ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేశారు. అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ పార్టీ పోటాపోటీగా హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు ప్ర‌ద‌ర్శించ‌డం ఒక ఎత్తు అయితే, గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు మోడీకి వ్య‌తిరేకంగా బైబై మోడీ అంటూ హోర్డింగ్ ల‌ను పెడుతున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు వెంట‌నే అప్ర‌మ‌త్తం అవుతోన్న పోలీసులు వాటిని తొల‌గిస్తున్నారు.

కార్య‌వర్గ స‌మావేశాలు ప్రాంభ‌మైన శ‌నివారం రోజున న‌గ‌ర‌మంత‌టా కొంద‌రు యువ‌కులు ఎర్ర‌టి డ్ర‌స్ కోడ్ తో ప్ల కార్డుల‌ను ప్ర‌ద‌ర్శించ‌డం స‌రికొత్త ఎత్తుగ‌డ‌. ఎల్బీన‌గ‌ర్‌, దిల్ షుక్ న‌గ‌ర్, నాగోల్, సికింద్రాబాద్ త‌దిత‌ర ప్రాంతాల్లోని కూడ‌ళ్ల‌లో యువ‌కులు డ్ర‌స్ కోడ్ లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నారు. వాళ్ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అయిన‌ప్ప‌టికీ ఇంకో ప్రాంతంలో వాళ్లు క‌నిపిస్తున్నారు. ఇలా ప్ర‌ధాని మోడీకి నిర‌స‌న‌గా హైద‌రాబాద్ లోని ఏదో ఒక మూల గ‌త రెండు రోజులుగా వినూత్న నిర‌స‌న‌లు చేస్తున్నారు.

ఇంకో వైపు సీఎం కేసీఆర్ విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి సిన్హాను బేగంపేట విమానాశ్ర‌యం నుంచి ర్యాలీగా జ‌ల‌విహార్ వ‌ర‌కు తీసుకురావ‌డం మ‌రో ఎత్తుగ‌డ‌. మంత్రులు, ఎమ్మెల్యేలు గ‌త రెండు రోజులుగా ర్యాలీని విజ‌య‌వంతం చేసేందుకు స‌న్నాహాలు చేశారు. సాధార‌ణంగా కేసీఆర్ ఎప్పుడూ ఇలాంటి ర్యాలీల‌కు దూరంగా ఉంటారు. ఉద్దేశ‌పూర్వ‌కంగా శ‌నివారం రోజున సిన్హాను హైద‌రాబాద్ కు ఆహ్వానించార‌ని తెలుస్తోంది. బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు జ‌రుగుతున్న వేళ పోటీగా ఈ ర్యాలీని ప్లాన్ చేశార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. మొత్తం మీద అటు మోడీకి వ్య‌తిరేకంగా హోర్డింగ్‌, ఫ్లెక్సీలు, ప్ల కార్డుల‌తో నిర‌స‌న‌లు, సిన్హాల‌కు ఘ‌న స్వాగ‌తంతో బీజేపీ జాతీయ కార్య‌వర్గ స‌మావేశాల మూడ్ నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చే ప్ర‌య‌త్నం టీఆర్ఎస్ చేస్తుంద‌ని స్ప‌ష్టం అవుతోంది. ఇలా చేయ‌డం రాజ‌కీయంగా ఆ పార్టీ ఎలాంటి బెనిఫిట్ ఉంటుందో చూడాలి.