తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Houses)లో భాగంగా లబ్ధిదారులకు గుడ్ న్యూస్ తెలిపింది ప్రభుత్వం. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasreddy)మాట్లాడుతూ.. ఇకపై ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ బిల్లులను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం పారదర్శకంగా, వేగవంతంగా కొనసాగుతున్నదని మంత్రి తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లు మంజూరు చేయగా, అందులో 1.23 లక్షల ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని చెప్పారు.
ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఒక్కింటికి రూ.5 లక్షలు మంజూరు చేస్తుండటం దేశంలోనే అద్భుతమైన ఘనతగా పేర్కొన్నారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత మొత్తంలో నిధులు ఇవ్వడం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి రీవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక్క ఇంటికి 40 టన్నుల ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తున్నామని వివరించారు. నిర్మాణ నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా అధికారులందరూ పర్యవేక్షణకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.
ఈ పథకం ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివాసం కలిగి లేని పేద కుటుంబాలకు భద్రమైన, గౌరవప్రదమైన జీవనావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి తెలిపారు. ప్రతి లబ్ధిదారుడి ఖాతాలో నేరుగా నగదు జమ చేయడం వల్ల మధ్యవర్తిత్వం లేకుండా లబ్ధి చేకూరుతోందని పేర్కొన్నారు. ఈ విధానం కొనసాగడం వల్ల ప్రజల నమ్మకాన్ని పెంచే విధంగా పథకం మరింత విజయవంతమవుతుందని అధికారులతో సమీక్షలో మంత్రి అభిప్రాయపడ్డారు.