Site icon HashtagU Telugu

Modi Election Strategy : మాదిగలకు మోడీ హామీ ఎన్నికల వ్యూహమేనా?

Janata Curfew

Modi's Promise To Madigalas Is It An Election Strategy..

By: డా. ప్రసాదమూర్తి

Narendra Modi Election Strategy : దేశమంతా పార్టీలన్నీ ఇప్పుడు సామాజిక న్యాయం పాట పాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీకి గాని మిగిలిన ప్రతిపక్షాలకు గాని సామాజిక న్యాయం విషయంలో ఎలాంటి మైలేజ్ దక్కకుండా ఆ రేసులో తాము ముందున్నామని చెప్పడానికి బిజెపి గట్టి ప్రయత్నమే చేస్తుంది. ప్రధాని నాలుగు రోజుల వ్యవధిలోనే రెండుసార్లు తెలంగాణ వచ్చారు. ఒకటి బీసీ సభ, రెండు ఎస్సీ సభ. ఎన్నికలు మరో రెండు వారాలు మాత్రమే ఉన్న సందర్భంలో ప్రధాని మోడీ (PM Modi) తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మొన్న జరిగిన బీసీ సభలో బీసీ నాయకుడ్ని ముఖ్యమంత్రిని చేస్తామని అశేష జన వాహిని సమక్షంలో ప్రకటించారు. అయితే ఆ అభ్యర్థి ఎవరు అనే విషయం చెప్పలేదు. బీసీల అభివృద్ధి కోసం తాము చేస్తున్న పనులు, ప్రవేశపెట్టిన పథకాలు గురించి ఒక జాబితాను కూడా ప్రధాని తన ఉపన్యాసంలో వల్లించారు. దీని తర్వాత వెంటనే ఎస్సీ వర్గీకరణకు కీలకంగా భావిస్తున్న సామాజిక న్యాయ పోరాటం సభ హైదరాబాదులో జరిగింది.

We’re Now on WhatsApp. Click to Join.

ఈ సభలో మోడీ (Modi) మాదిగల న్యాయపరమైన డిమాండుకు, వారి న్యాయపరమైన హక్కుకు తన మద్దతు సంపూర్ణంగా ఉంటుందని ప్రకటించారు. మూడు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో మాదిగలు రిజర్వేషన్లలో తమ ప్రత్యేక వాటా కోసం సాగిస్తున్న పోరాటం పట్ల తనకు, తన ప్రభుత్వానికి ఎంతో సానుకూలత ఉన్నట్టు మోడీ చెప్పుకొచ్చారు. అంతేకాదు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి మూడు దశాబ్దాలుగా తన జీవితాన్ని, కాలాన్ని అంకితం చేసి పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ తన తమ్ముడు అని, అతనితో కలిసి మాదిగల హక్కులు సాధించేందుకు తాను కూడా పోరాటం చేస్తానని ఎంతో భావోద్విగ్నంగా సభాముఖంగా ప్రకటించారు. అయితే మాదిగల ప్రత్యేక హక్కుల కోసం, ఎస్సీ వర్గీకరణ కోసం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు చేపట్టడం, అమలు చేయడం జరిగినా, దాన్ని వ్యతిరేకించిన మరో వర్గం సుప్రీంకోర్టుకు వెళ్లడం, న్యాయపరమైన చిక్కులు ఎదురు కావడంతో ఎస్సీ వర్గీకరణ అమలు ఆగిపోయింది.

అప్పటినుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ప్రభుత్వాలు, విడివిడి ప్రభుత్వాలు, సమస్య న్యాయస్థానంలో ఉంది కాబట్టి తాము చేసేది ఏమీ లేదని తేల్చి చెప్పేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ఎన్నికల వాడి వేడి వాతావరణం లో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) మాదిగలకు, వారి పోరాటానికి తాము అండగా ఉంటామని చెప్పడం తెలంగాణలో మాదిగ సముదాయానికి చాలా పెద్ద హామీ దొరికినట్టయింది.

ఇది ఎన్నికల వ్యూహమేనా?

ప్రధాని మోడీ (Modi) మాదిగల ప్రత్యేక హక్కుల కోసం ఎస్సీ వర్గీకరణ విషయంలో ఒక కమిటీ నియమిస్తామని చెప్పారు. అలాగే సుప్రీంకోర్టులో జరుగుతున్న న్యాయపోరాటం విషయంలో కూడా మాదిగల పక్షాన తాము నిలబడి ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. మూడు దశాబ్దాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని మాదిగలు కంటున్న కలలు మోడీ హామీ ద్వారా సాకారం అయ్యే అవకాశం ఉందా అనే మీమాంస ఇప్పుడు తలెత్తుతుంది. తెలంగాణలో మాదిగల సముదాయం సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇంతకాలం ఎన్నోసార్లు ఆ సముదాయానికి చెందిన నాయకులు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కలిసే ఉంటారు. కానీ ఇలాంటి హామీ వారికి ఎప్పుడూ దక్కలేదు. ఇంత బహిరంగ భరోసా వారికి ఎన్నడూ దొరకలేదు. మరి ఎన్నికలకు రెండు వారాల ముందు తెలంగాణ వచ్చి ప్రధాని స్వయంగా తానే మాదిగల పోరాటంలో ముందు ఉంటానని అత్యంత గంభీరమైన భావోద్విగ్నమైన వాక్చాతుర్యంతో భరోసా ఇవ్వడం ఎంతవరకు నమ్మాలి అనే విషయం మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిజంగా బిజెపి నాయకులకు మాదిగల పట్ల అంత అనురాగం, ప్రేమ ఉంటే ఇప్పటిదాకా ఏం చేశారు అనే ప్రశ్నకు వారే సమాధానం చెప్పాలి. అలాగే ఇప్పుడైనా పార్లమెంట్లో దీనికి సంబంధించి ఒక బిల్లు తీసుకువస్తామని, సుప్రీంకోర్టులో జరుగుతున్న న్యాయపోరాటాన్ని తీవ్రతరం చేస్తామని, త్వరలో ఎస్సీ వర్గీకరణ తామే చేస్తామని ఎక్కడా ప్రధాని మోడీ తన ఉపన్యాసంలో స్పష్టంగా పేర్కొనలేదు. కాబట్టి ఈ హామీ ఎన్నికల హామీగా తీసుకోవడమే తప్ప ఇది నిజంగా అమలు జరుగుతుందని ఆశలు పెట్టుకోవాల్సిన పనిలేదని కొందరు మేధావులు అప్పుడే పెదవి విరిచేస్తున్నారు.

ఏది ఏమైనా మనసులో ఎలాంటి ఉద్దేశ్యాలు ఉన్నా, అన్ని పార్టీలూ ఇప్పుడు సామాజిక న్యాయం గురించి, అట్టడుగు వర్గాల రిజర్వేషన్ల గురించి, అన్ని రంగాలలో వారి సముచిత ప్రాతినిధ్యం గురించి మాట్లాడుతున్నాయి. ఇది శుభ పరిణామం. శతాబ్దాల తరబడి ఈ దేశంలో కులం పేరుతో అణిచివేయబడిన వర్గాలు చైతన్యం పొంది తమ వాటా తాము సాధించుకునే పోరాటం చేసే స్థాయికి ఎదిగాయి. ఈ పోరాటం ముందు ఏ రూపం తీసుకుంటుందో.. ఏ పార్టీ ఈ పోరాటానికి అంకితం అవుతుందో.. సామాజిక న్యాయం ఎన్నికల తర్వాత నీటి మీద రాతలాగే అవుతుందా.. లేక ఎన్నికలలో చేసిన వాగ్దానం నేతలకు గుర్తుంటుందా.. అనే విషయాలు వేచి చూడాల్సిందే.

Also Read:  CM KCR : 16 రోజులు 54 స్థానాలు.. సుడిగాలి పర్యటనలకు కేసీఆర్ రెడీ

Exit mobile version