Site icon HashtagU Telugu

Etela Rajender : ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో నాలుగో స్థానానికి తెచ్చాం

Etela Rajendhar

Etela Rajendhar

Etela Rajender : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్లుగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. శామీర్‌పేట్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, “2014లో అధికారం చేపట్టే సమయానికి దేశ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉండేది. అయితే, ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది” అని తెలిపారు.

దేశాన్ని తీవ్రంగా కుదిపేసిన ఉగ్రదాడులకు ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా మోదీ ప్రభుత్వం గట్టి ప్రతిఘాతం ఇచ్చిందని ఈటల గుర్తు చేశారు. దేశ మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేలా కేంద్రం చర్యలు తీసుకుందని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సహకారం లేదన్న దుష్ప్రచారం చేస్తోందని ఈటల మండిపడ్డారు. “సత్యం చెప్పడం రాజకీయ నాయకుల బాధ్యత. కానీ కాంగ్రెస్ నేతలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు” అని అన్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి విజయరామారావు మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో మంత్రులు కుంభకోణాలకు పాల్పడ్డారని, వారు ఇప్పటికీ జైలులో ఉన్నారని విమర్శించారు. “బీజేపీ ప్రభుత్వం అవినీతి రహిత, పారదర్శక పాలనకు మారుపేరు” అని ఆయన పేర్కొన్నారు. మహిళా సాధికారత, గ్రామీణ అభివృద్ధి, మరుగుదొడ్ల నిర్మాణం వంటి అంశాల్లో మోదీ నేతృత్వం అగ్రస్థానంలో ఉందని విజయరామారావు అభిప్రాయపడ్డారు.

CM Chandrababu : ఎన్డీయే కూటమికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు : సీఎం చంద్రబాబు