Modi and KCR: సభలో కేసీఆర్ పేరును ప్రస్తావించకపోవడం వెనుక మోదీ వ్యూహం ఇదే!

పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన విజయసంకల్ప సభలో కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను ప్రధాని మోదీ తీవ్రంగా విమర్శిస్తారని బీజేపీ శ్రేణులు భావించాయి.

  • Written By:
  • Updated On - July 3, 2022 / 11:35 PM IST

పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన విజయసంకల్ప సభలో కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను ప్రధాని మోదీ తీవ్రంగా విమర్శిస్తారని బీజేపీ శ్రేణులు భావించాయి. కానీ మోదీ మాత్రం తన సహజ శైలికి భిన్నంగా ప్రసంగించారు. ఎక్కడా కేసీఆర్ పేరును ప్రస్తావించలేదు. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తలతోపాటు అందరూ ఒక్కసారిగా విస్తుపోయారు. మోదీ కావాలనే ఓ స్ట్రాటజీ ప్రకారం అలా మాట్లాడారా లేక ఇంకేదైనా కారణముందా అన్న చర్చ నడిచింది.

అసలు ఈ సభలో రాజకీయ విమర్శలు చేయకపోవడానికి కారణం ఏంటో బీజేపీ వర్గాలకు అంతుబట్టలేదు. తెలంగాణకు కేంద్రం ఏ సాయం చేయడంలేదు అని ఈమధ్యకాలంలో కేసీఆర్ తో పాటు తెలంగాణ మంత్రులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి విమర్శలకు సమాధానం చెప్పేలా.. తాము తెలంగాణకు ఏం చేశామో.. మోదీ తన ప్రసంగంలో ఏకరువు పెట్టారే తప్ప ఎక్కడా ఆరోపణలకు, విమర్శలకు తావివ్వలేదు.

ఈ సభకు అసంఖ్యాకంగా ప్రజలు తరలివచ్చారు. వారిని చూసి మోదీయే ఆశ్చర్యపోయారు. ఆనందపడ్డారు. అదే విషయాన్ని స్టేజ్ పైనే ఉన్న నడ్డాతో ప్రస్తావించారు. పనిలోపనిగా బండి సంజయ్ ను భుజం తట్టి మరీ ప్రశంసించారు. ఆ సన్నివేశాన్ని చూసిన బీజేపీ శ్రేణులు.. మోదీ ప్రసంగం ఉరకలెత్తిస్తుందని ఆశపడ్డారు. కానీ అలా జరగలేదు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ర్యాలీ తరువాత జరిగిన సభలో కేసీఆర్ మోదీని విమర్శించారు. ప్రశ్నాస్త్రాలు సంధించారు. బీజేపీ ఏర్పాటుచేసిన సభలో వాటిపై స్పందించాలని డిమాండ్ చేశారు. లేదంటో మోదీని దోషిగా భావిస్తామన్నారు. అయినా సరే.. మోదీ మాత్రం ఎక్కడా కేసీఆర్ ను విమర్శించలేదు.

బీజేపీ నేతలు మాత్రం.. ఆ సభ ద్వారా తెలంగాణకు ఏం చేశామో చెప్పడమే మోదీ ఉద్దేశమని.. అయినా కేసీఆర్ ను విమర్శించడానికి మోదీ అవసరమా అంటూ సర్దిచెప్పుకుంటున్నారు. నిజానికి తన ప్రసంగం తీరు వెనుక మోదీ వ్యూహమేంటో త్వరలో తేలుతుందేమో చూడాలి.