MLC Posts : అంత‌ర్గ‌త గ్రూపుల‌కు కేసీఆర్ చెక్ , ఎమ్మెల్సీలుగా 7 కొత్త మొఖాలు?

కేసీఆర్ మంత్రివ‌ర్గం మార్పులు చేయ‌డానికి సిద్ధమ‌వుతార‌ని తెలుస్తోంది. .

  • Written By:
  • Publish Date - December 28, 2022 / 12:26 PM IST

కొత్త ఏడాది బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స‌రికొత్త ఈక్వేష‌న్ల‌ను రాజ‌కీయ తెర‌మీద‌కు తీసుకురాబోతున్నారు. ముంద‌స్తుకు అనుకూల ప‌రిస్థితులు లేక‌పోతే జ‌న‌వ‌రి లేదా ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో మంత్రివ‌ర్గం(Cabinet) మార్పులు చేయ‌డానికి సిద్ధమ‌వుతార‌ని తెలుస్తోంది. అంతేకాదు, త్వ‌ర‌లో ఖాళీ కానున్న ఏడు ఎమ్మెల్సీ పోస్టుల‌ను(MLC Posts) కూడా నింప‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఎన్నిక‌ల టీమ్ ను స‌ర్వేల ఆధారంగా కేసీఆర్ త‌యారు చేసుకోనున్నారని టాక్‌.

Also Read : TS Cabinet: మంత్రివర్గంలోకి కవిత..? నలుగురు ఔట్..?

రాబోవు ఐదు నెలల్లో ఖాళీగా ఉన్న ఏడు ఎమ్మెల్సీ స్థానాల (MLC Posts) భ‌ర్తీపై కేసీఆర్ క‌స‌ర‌త్తు చేస్తున్నారు. అసెంబ్లీతో పాటు అన్ని స్థానిక సంస్థల్లో బీఆర్‌ఎస్‌కు పూర్తి మెజారిటీ ఉంది. ఆ పార్టీ మొత్తం ఏడు స్థానాలను సునాయాసంగా కైవసం చేసుకునే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు అలిమినేటి కృష్ణారెడ్డి, వూల్లోళ్ల గంగాధర్ గౌడ్, కురుమయ్యగారి నవీన్‌కుమార్ మార్చి 29న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌బోతున్నారు. దీంతో ఎమ్మెల్యేల కోటా కింద మూడు సీట్లు ఖాళీ కానున్నాయి. మే 27న గవర్నర్ కోటా కింద రెండు స్థానాలు ఎమ్మెల్సీలు డి. రాజేశ్వర్ రావు, ఫారూఖ్ హుస్సేన్ ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తారు. ఉపాధ్యాయ కోటా కింద, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి మార్చి 29న పదవీ విరమణ చేయనుండగా, స్థానిక అధికారుల కోటా కింద 2017 మార్చిలో టీఆర్‌ఎస్ (ప్రస్తుతం బీఆర్‌ఎస్) మద్దతుతో ఎన్నికైన ఏఐఎంఐఎం ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ మార్చి 27న పదవీ విరమణ చేయ‌నున్నారు.

ఎమ్మెల్సీ స్థానాల (MLC Posts) భ‌ర్తీ

రెండోసారి 2018లో కేసీఆర్ సీఎం అయిన త‌రువాత కాంగ్రెస్, టీడీపీ, స్వతంత్ర ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లోకి చాలా మంది చేరారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అంతర్గత పోరు కొన‌సాగుతోంది. ఆయా స్థానాల్లో ఓడిపోయిన పాలైన టీఆర్‌ఎస్‌ నేతలు 2023 ఎన్నిక‌ల్లో పోటీకి సిద్ధం అవుతున్నారు. ఇంచార్జిలుగా ఉన్న త‌మ‌కు పార్టీ అధిష్టానం టికెట్లు ఇస్తుంద‌న్న న‌మ్మ‌కం పెట్టుకున్నారు. లేదంటే, ఇతర పార్టీల్లోకి మారాల్సి వస్తుందని ప‌రోక్ష సంకేతాలు ఇస్తున్నారు. అలాంటి నేతలకు ఖాళీ కానున్న ఎమ్మెల్సీ పదవులను ఇవ్వ‌డం ద్వారా అసంతృప్తిని చ‌క్క‌బెట్టాల‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్టు బీఆర్ఎస్ శ్రేణుల్లోని వినికిడి.

మొదట ఖాళీగా ఉన్న ఏడు శాసన మండలి (MLC) స్థానాలకు అంత‌ర్గ‌త విభేదాలున్న నియోజ‌క‌వ‌ర్గాల నుంచి నామినేట్ చేస్తారు. ప్ర‌స్తుతం ఉన్న ఏడుగురు ఎమ్మెల్సీల‌కు ఆరు సంవత్సరాల పదవీకాలం మార్చి, మేలో ముగుస్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవ‌కాశం లేని వాళ్ల‌కు ఎమ్మెల్సీల‌ను కేటాయించడానికి ప్రాధాన్యం ఇస్తార‌ని తెలుస్తోంది. కుల సమీకరణాల కార‌ణంగా కేబినెట్‌లో(Cabinet) స్థానం పొందలేని వారికి సిఎం సానుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది. నామినేటెడ్ పదవులు దక్కకపోవడం, పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు లభించడం లేదన్న అంశంపై గత కొంతకాలంగా అంతర్గత పోరు నడుస్తోంది.

నామినేటెడ్ పదవులు

ఎన్నికల వేళ వీలున్నంత వ‌ర‌కు అంతర్గ‌త పోరును త‌గ్గించ‌డానికి కేసీఆర్ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. జాతీయ స్థాయి రాజ‌కీయాల వైపు కొంద‌రు సీనియ‌ర్ల‌ను మ‌ళ్లించ‌డానికి సిద్ధం అయ్యారు. ఇప్ప‌టికే ఆ మేర‌కు కొంద‌రికి సంకేతాలు ఇచ్చారు. మిగిలిన వాళ్ల‌కు నామినేటెడ్ ప‌ద‌వుల‌ను ఇవ్వ‌డం ద్వారా అంత‌ర్గ‌త పోరును త‌గ్గించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. 2023 ఎన్నిక‌ల‌కు బీఆర్ఎస్ పార్టీకి చాలా కీల‌కం. మూడోసారి అధికారంలోకి రావ‌డానికి ఎత్తుగ‌డ వేస్తున్నారు. ఆ క్ర‌మంలో ఇత‌ర పార్టీల‌కు బీఆర్ఎస్ నేత‌లు వెళ్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు.

Also Read : CM KCR : రాజ్ భవన్ విందుకు సీఎం కేసీఆర్ దూరం!