MLC kavitha: ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్, పోలీసులకు ఫిర్యాదు

  • Written By:
  • Publish Date - January 17, 2024 / 06:35 PM IST

MLC kavitha: హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఖతాలు హ్యాక్ కు గురయ్యాయి. సైబర్ నేరగాళ్లు మంగళవారం నాడు రాత్రి 10 నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు వరుసగా పలు సార్లు హ్యాకింగ్ కు యత్నించారు. అనుమానాస్పదంగా లాగిన్ అయ్యి దుండగులు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సంబంధం లేని ఒక వీడియోను పోస్టు చేశారు. వెంటనే గుర్తించిన కవిత తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్ కు గురైనట్లు ఎక్స్ ద్వారా వెల్లడించారు. డీజీపీకి, సైబర్ సెక్యూరిటీ విభాగానికి ట్యాగ్ చేశారు. సోషల్ మీడియా ఖాతాలను పూర్తి స్థాయిలో తిరిగి పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇక‌ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికారిక ట్విట్టర్ (X) ఖాతా హ్యాక్ అయినట్లు తెలంగాణ పోలీసులు జనవరి 17 బుధవారం నాడు తెలియజేశారు. గుర్తు తెలియని వ్యక్తులు గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసి పాస్ వర్డ్ మార్చేశారు. కంపెనీ నియమనిబంధనలు ఉల్లంఘించారంటూ ట్విట్టర్ కంపెనీ నుంచి గవర్నర్ కు ఓ మెయిల్ వచ్చింది. గవర్నర్ తన ట్విట్టర్ అకౌంట్ ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా పాస్ వర్డ్ తప్పంటూ సమాధానం వచ్చింది. గవర్నర్ ట్విట్టర్ ఖాతాలో సంబంధంలేని పోస్టులు ఉన్నట్లు గుర్తించారు.

ఈ విషయంపై రాజ్ భవన్ సిబ్బందిని గవర్నర్ ఆరా తీసి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో రాజ్ భవన్ అసిస్టెంట్ కంప్ట్రోలర్ సైబర్ పోలీసులను ఆశ్రయించారు. గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారంటూ ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్‌లో రాజ్ భవన్ అధికారులు ఈనెల 14న ఫిర్యాదు చేశారు. గవర్నర్ ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో ఇతర మేసేజ్ రావడంతో పోలీసులకు అధికారులు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.