Kavithas Letter : తాను నిందితురాలిని కాదని.. బాధితురాలినని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధమున్న కొందరు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా తనను దాదాపు రెండున్నరేళ్లు పాటు వేధించి, చివరికి అరెస్టు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని కూడా ఈడీ సంపాదించలేకపోయిందని కవిత పేర్కొన్నారు. ‘‘కేవలం స్టేట్‌మెంట్ల మీద ఆధారపడి కేసు దర్యాప్తు జరుగుతోంది. న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా సైతం కేసు విచారణ సందర్భంగా అవినీతి జరిగినట్లు ఆధారాల్లేవు. ఇది నిలిచే కేసు కాదన్నారు’’ అని ఆమె గుర్తు చేశారు. లిక్కర్ స్కాంతో తనకు సంబంధం లేదని, దాని వల్ల తనకు ఎలాంటి లబ్ధి జరగలేదన్నారు. పరీక్షల టైమ్‌లో చిన్న కొడుకు నుంచి తనను దూరం చేశారని తెలిపారు. ఈమేరకు వివరాలతో రౌస్ ఎవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరీ భవేజాకు తిహార్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నాలుగు పేజీల లేఖ(Kavithas Letter) రాశారు. కవిత చేతిరాతతో ఒక నోట్‌బుక్‌లో రాసిన ఈ లేఖ మీడియాకు విడుదలైంది.
We’re now on WhatsApp. Click to Join
‘‘ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు అంతులేని కథగా, మీడియా ట్రయల్‌గా మారిపోయింది. ఈ కేసును మోపి నా వ్యక్తిగత, రాజకీయ జీవితానికి మాయని మచ్చ తెచ్చారు. చివరకు నా ఫోన్ నెంబర్ కూడా టీవీ ఛానళ్ళకు లీకైంది. నా వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లింది. ఈడీ, సీబీఐ అధికారులు పలుమార్లు నా ఇంట్లో రెయిడ్ చేశారు. నన్ను ప్రశ్నించారు. శారీరకంగా, మానసికంగా వేధించారు, చివరకు నన్ను అరెస్టు చేశారు.నాకు తెలిసిన వివరాలన్నీ వాళ్లకు చెప్పాను. నా బ్యాంకు లావాదేవీలు, వ్యాపార వివరాలను వాళ్లకు ఇచ్చేశాను’’ అని లేఖలో కవిత ప్రస్తావించారు. ‘‘ఫోన్లు ధ్వంసం చేశానని, ఆధారాలను మాయం చేశానని పదేపదే నన్ను నిందించారు. అందులో నిజం లేదు’’ అని ఆమె తెలిపారు.
Also Read :Kavitha Custody : కవితకు షాక్.. మరో 2 వారాలు జ్యుడీషియల్ కస్టడీ
‘‘ఈడీ, సీబీఐ కేసుల్లో దాదాపు 95 శాతం ప్రతిపక్ష నేతలపైనే ఉన్నాయి. బీజేపీలో చేరిన వెంటనే వారిపైన నమోదైన కేసులు అర్ధంతరంగా ఆగిపోతున్నాయి. మా పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నంతకాలం ఎందుకు అరెస్టు చేయలేదు? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత అరెస్టు చేశారెందుకు ?’’ అని దర్యాప్తు సంస్థలకు కవిత ప్రశ్నలు సంధించారు. ‘‘కేసుతో సంబంధం లేకపోయినా దర్యాప్తు సంస్థలకు సహకారం అందిస్తున్నాను. తప్పు చేయకపోయినా అరెస్టయ్యి జైల్లో ఉండాల్సి వచ్చింది. నా కుమారుడి చదువును దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇవ్వండి. ఒక తల్లిగా నాకు నా జీవితంలో ఇది ఒక బాధ్యత’’ అని జడ్జిని కవిత కోరారు. తాను లేకపోవడం ఆ అబ్బాయి మానసిక ప్రవర్తనపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు.