Kavitha Letter: ప్రీతి తల్లిదండ్రులకు ఎమ్మెల్సీ కవిత లేఖ

ప్రీతి మరణవార్త రాజకీయ నాయకులనే కాదు సామాన్య ప్రజలను తట్టి లేపింది.

Published By: HashtagU Telugu Desk
Preethi

Preethi

డాక్టర్ ప్రీతి మరణం తెలుగు రాష్ట్రాలను కదిలించిన విషయం తెలిసిందే. సైఫ్ వేధింపుల కారణంగానే చనిపోయినట్టు స్పష్టమైంది. ఆమె మరణవార్త రాజకీయ నాయకులనే కాదు సామాన్య ప్రజలను తట్టి లేపింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలనే డిమాండ్లు వినిపించాయి. ఇప్పటికే ఈ ఇష్యూపై కేటీఆర్ రియాక్ట్ అవ్వగా, తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ మేరకు ఆమె తల్లిదండ్రులకు లేఖను రాశారు.

గౌరవనీయులైన నరేందర్ – శారద గారికి

సోదరి డాక్టర్ ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఒక తల్లిగా నేను ఎంతో వేదనకు గురయ్యాను. ప్రీతి కోలుకోవాలని గత మూడు రోజులుగా కోరుకున్న కోట్లాది మందిలో నేనూ ఒకరిని .

ఎన్నో కష్టాలకోర్చి పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రీతికి ఇలా జరగడం జీర్ణించుకోలేక పోతున్నాను. చదువుకుని సమాజానికి సేవ చేయాలన్న తపన, పట్టుదల మెండుగా ఉన్న ప్రీతికి ఇలా జరగడం దురదృష్టకరం. ఒక ఉత్తమ వైద్యురాలిని సమాజం కోల్పోయింది. అందుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. కడుపుకోత అనుభవిస్తున్న మీకు ఎంత ఓదార్పు ఇవ్వాలని ప్రయత్నం చేసినా అది చాలా తక్కువే అవుతుంది. ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడని పరిస్థితి ఇది.

మీ కుటుంబానికి సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వం మరియు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మీ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రీతి మరణానికి కారణమైన దోషులను రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టబోదు అని మీకు హామీ ఇస్తున్నాము. ఇలాంటి సంఘటనలు ఇకపై పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.

యావత్తు రాష్ట్ర ప్రజలు మీ వెంట ఉన్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో భగవంతుడు మీకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.

కల్వకుంట్ల కవిత

  Last Updated: 28 Feb 2023, 04:06 PM IST